Kammam: ప్రాణాలకు ఖరీదు..! సత్తుపల్లిలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల తీరు

by Ramesh Goud |
Kammam: ప్రాణాలకు ఖరీదు..! సత్తుపల్లిలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల తీరు
X

సత్తుపల్లిలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ప్రాణాలకు ఖరీదు కడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, కాన్పుల కోసం ఆస్పత్రులకు వెళ్లిన వారు మృతి చెందితే.. బాధిత కుటుంబాలతో బేర సారాలు నిర్వహించి, ఎంతో కొంత ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తున్నది. సత్తుపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలల వ్యవధిలో నలుగురు మృతి చెందగా, బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగడంతో, వారిని సముదాయించి, రూ.లక్షల్లో చెల్లించినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా.. వైద్యాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడో ఒకసారి తనిఖీలు చేసి నిబంధనలు పాటించని పలు ఆస్పత్రులను సీజ్ చేశారు. ప్రస్తుతం అటువంటి తనిఖీలు జరగకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నెలల వ్యవధిలోనే నలుగురు బలి కావడంతో గర్భిణులు, రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి... ఖమ్మం జిల్లాలో ఆంధ్రా సరిహద్దు కావడంతో వైద్య సేవలకు ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ల లేని పేద, మధ్య తరగతి ప్రజలు ఇక్కడి వస్తుంటారు. వారిని ఆసరాగా చేసుకుని సత్తుపల్లిలో పదుల సంఖ్యలో ప్రైవేట్ ఆస్పత్రులు పుట్టుకొచ్చాయి. వైద్య వృత్తి ప్రజాసేవ అయినప్పటికీ కొందరు ప్రైవేటు వ్యక్తులు వైద్య వృత్తిలోకి ప్రవేశించి, అక్రమార్జనే ధ్యేయంగా సాగుతూ, సరైన వైద్యంపై శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. సత్తుపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలల వ్యవధిలోనే ముగ్గురు బాలింతలు, టైఫాయిడ్ జ్వరంతో మహిళ, ఓ విద్యార్థి మృతి చెందడం ఆందోళనకు గురిస్తున్నది.

ఆగస్టు4న రేగళ్లపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉస్మాన్ షాషా కుమార్తె తబూసలం (15) తీవ్ర టైఫాయిడ్ జ్వరంతో స్థానిక బాలాజీ థియేటర్ సమీపంలో ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు వైద్య కోసం వెళ్లింది. బాలికకు ప్లేట్లెట్లు పడిపోయినా మూడు రోజులు వైద్యం అందించి అనంతరం మృతి చెందింది. చనిపోయిన బాలికను మెరుగైన వైద్యం కోసం అంటూ ఖమ్మం తరలించే ప్రయత్నం విఫలం కాగా బాలిక కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తునా ఆందోళన చేయడంతో అర్ధరాత్రి ఒంటి గంట వరకు పంచాయితీ నిర్వహించి, రూ.5లక్షలు నగదు ఇచ్చి రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. ఇలాగే స్థానిక బస్టాండ్ సమీపంలో ప్రముఖ వైద్యురాలు ఆస్పత్రికి ఓ గర్భిణి ప్రసవం కోసం వచ్చి బాలింతగా మృతి చెందారు. ఆస్పత్రి నిర్వాహకులు మృతురాలి బంధువులతో మాట్లాడి గుట్టుగా పంచాయితీ నిర్వహించి రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. మరో ఘటనలో పాత సెంటర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అక్టోబర్2న నాచారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రావణి (22) మృతి చెందగా బంధువులు ఆందోళనకు దిగడంతో రూ.5లక్షల నష్టపరిహారం ఇచ్చినట్లు తెలియవచ్చింది. ఇటీవల పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న మహిళకు స్థానిక ఆర్ఎంపీ అందించిన వైద్యం వికటించి మృతి చెందడంతో బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెల్లించినట్లు సమాచారం. ఈనెల28న బస్టాండ్ సమీపంలో ప్రైవేట్ ఆస్పత్రికి వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామానికి చెందిన పిల్లి స్నేహలత (30) ప్రసవం కోసం రాగా ఆమెకు మత్తు మందు డోస్ ఎక్కువ కావడంతో కోమా స్థితికి చేరి కన్నుమూసింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని మహిళ బంధువులు ఆందోళన చేయడంతో ఆస్పత్రి నిర్వహకులు 10.లక్షల నగదు విడతల వారీగా అందజేస్తామని చెప్పి రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది.

ఇలా నెలల వ్యవధిలోనే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రాణాలు పోతున్నా.. జిల్లా వైద్యాధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. ఆస్పత్రి నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 2017న అప్పటి డీఎంహెచ్ఓ కొండలరావు సత్తుపల్లిలోని పలు హాస్పిటళ్లను సందర్శించి నిబంధనలు అతిక్రమించిన, పాటించని రెండు ఆస్పత్రులను, నాలుగు ల్యాబ్‌లు సీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్ ఆస్పత్రులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. నెలల వ్యవధిలోనే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో బాలింతలు, గర్భిణులు, రోగులు, భయాందోళనకు గురవుతున్నారు.

విచారణ జరిపి నివేదిక అందజేస్తాం.. తలారి సీతారాం, డిప్యూటీ డీఎంహెచ్ఓ

బాలింత మృతిపై సంబంధిత కుటుంబసభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా గత నెలలో జరిగిన బాలింత మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను జిల్లా వైద్యాధికారికి అందించాం. ఇటీవల ప్రైవేట్ ఆస్పత్రిలో మరో బాలింత మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదికను జిల్లా ఉన్నతస్థాయి అధికారులకు అందజేస్తాం. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story