Indiramma Committees : నిజమైన కార్యకర్తలకు మొండి 'చేయి'..

by Sumithra |
Indiramma Committees : నిజమైన కార్యకర్తలకు మొండి చేయి..
X

దిశ, భద్రాచలం : ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటులో భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వడం సంచలనానికి దారి తీసింది. ఎమ్మెల్యే సొంత మండలంలో ఎమ్మెల్యే తెల్లంకు వ్యతిరేకంగా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీలలో మొండి చేయి చూపారని, వలస వచ్చిన వారికి చోటు కల్పించారని ఫ్లెక్సీలు వెలవడం వివాదాలకు దారితీసే అవకాశం ఉంది.

భట్టి వర్సెస్ పొంగులేటి వర్గాలు..

భద్రాచలం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ నాయకులు విడివిడిగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే వెంకట్రావు మొదటి నుంచి పొంగులేటి శిష్యుడుగా కొనసాగుతుండగా, మాజీ ఎమ్మెల్యే అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్య భట్టి విధేయుడు. నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నా పొదెం వీరయ్య, వెంకట్రావు కలిసి తిరగడం లేదు. దీంతో వర్గ విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో భారీ నష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story