గురుకులంలో ఇంటి దొంగలు.. మెనూ అమలు చేయని సిబ్బంది

by Kalyani |
గురుకులంలో ఇంటి దొంగలు.. మెనూ అమలు చేయని సిబ్బంది
X

దిశ, వైరా : వైరాలోని తెలంగాణ గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాలలో ఇంటి దొంగలు విద్యార్థినీల కడుపు కొట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు. పౌష్టికాహారం దేవుడేరుగు..... కనీస నాణ్యత లేని ఆహారాన్ని విద్యార్థులకు అందించి అవినీతి అక్రమాలకు తెరలేపుతున్నారు. విద్యార్థినీలకు సరిపడా ఆహారాన్ని తయారు చేయకుండా వారు అర్ధాకలితో అలమటించేలా ఇక్కడ సిబ్బంది ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఇక్కడ సిబ్బంది అమలు చేయడం లేదు. గురుకుల పాఠశాల కళాశాల చెందిన సిబ్బంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కై విద్యార్థినీల కడుపు కొడుతున్నారు. ఆహార విషయంలో ఈ పాఠశాల కళాశాలలో ప్రభుత్వ నిబంధనలు కనీసం అమలు కావడం లేదు. ఈ పాఠశాలలో కనీసం మెనూ బోర్డు కూడా లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విద్యార్థులకు అందించే ఆహారం పై ప్రిన్సిపాల్ తో పాటు సిబ్బంది కనీస పర్యవేక్షణ కరువైంది. స్వయాన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇక్కడ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారిలో మార్పు రావడం లేదు. నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఈ పాఠశాల, కళాశాలపై ఎంఈఓ కనీస పర్యవేక్షణ కరువైంది. గత ఆదివారం ఈ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పర్యటన సమయంలో ప్రిన్సిపాల్ తో పాటు బాధ్యులైన వారు పాఠశాలకు డుమ్మా కొట్టారు. ఆదివారం విద్యార్థినీలకు చికెన్ బదులు బెండకాయ కూర అందించారు. అంతేకాకుండా కోడిగుడ్లు ఇతర పౌష్టికాహారాలను తమకు అందించటం లేదని విద్యార్థినీలు డిప్యూటీ సీఎంకి వివరించారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు.

కాంట్రాక్టర్లతో కుమ్మక్కు

ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు కాంట్రాక్టర్ ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే ఈ పాఠశాలకు కూరగాయలు, మటన్ చికెన్, సరుకులు, పండ్లు, ఇతర సామగ్రి సరఫరా చేసే కాంట్రాక్టర్లతో కలిసి సిబ్బంది అందిన వరకు దండుకుంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించకపోవడంతో వారు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యమైన వస్తువులు సరఫరా చేయనప్పటికీ గురుకుల పాఠశాల సిబ్బంది కనీసం పట్టించుకోవడం లేదు. నాణ్యతలేని వస్తువులను, కూరగాయలను సరఫరా చేస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యార్థినీల కడుపు కొట్టి మరి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. విద్యార్థినిలకు మెనూ ప్రకారం అల్పాహారాన్ని కూడా అందించటం లేదు. కాంట్రాక్టర్లు, గురుకుల సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

నోటీసులతోనే సరి పెడతారా.... చర్యలు తీసుకోరా

విద్యార్థినీలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేయడంతో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ పాఠశాలను సందర్శించారు. మెనూ ప్రకారం ఆహారాన్ని విద్యార్థినిలకు ఎందుకు అందించటం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు సిబ్బంది పర్యవేక్షణ ఎందుకు కరువైందని మండిపడ్డారు. స్థానిక ఎంఈఓపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ రమ, ఏటీపీ రోహిణి తో పాటు వైరా ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు కు డీఈఓ ద్వారా ఆమె షోకాజ్ నోటీసులు జారీ చేయించారు. కేవలం షోకాజ్ నోటీసులతోనే వదిలేస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్వయానా డిప్యూటీ సీఎం పర్యటన సమయంలో పాఠశాలలో అనేక లోపాలు బయటపడినప్పటికీ కేవలం షోకాజ్ నోటీసులు ఇవ్వటమేంటని చర్యలు తీసుకోరా అంటూ విద్యార్థినిల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మెనూ అమలు చేయని వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story