Kishan Reddy: కమ్యూనిస్టు పార్టీ కంటే బీజేపీనే పెద్దది

by Gantepaka Srikanth |
Kishan Reddy: కమ్యూనిస్టు పార్టీ కంటే బీజేపీనే పెద్దది
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీకి గుర్తింపు లభించిందని, గతంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి ఆ ఖ్యాతి ఉండేదని, 2014 తర్వాత దాన్ని వెనక్కు నెట్టిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించి రికార్డు సృష్టించిందన్నారు. గతంలో 2014లో పార్టీలో సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ జరిగిందని, పదేండ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు చేపడుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అక్టోబరులో ప్రారంభం కానున్నదని, కానీ తెలంగాణలో మాత్రం ఇప్పుడే మొదలైందన్నారు. సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో బుధవారం బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బుధవారం ప్రారంభించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. కొత్త సభ్యత్వ నమోదులో పార్టీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా మొదలు సభ్యులంతా పాత సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకుంటారన్నారు.

సన్నాహక సమావేశాలు, వర్క్ షాపులతో పోలింగ్ బూత్ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. ఈసారి తెలంగాణలో రైతులు, మహిళలు, యువతపై ఎక్కువ ఫోకస్ పెట్టి వారిని పార్టీ సభ్యులుగా చేర్చుకుంటామన్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో సుమారు 77 లక్షల మంది ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారన్నారు. బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని, కానీ కాంగ్రెస్ పట్ల ప్రేమతో కాదన్నారు. గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని ఊదరగొట్టిందని, ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నదని, ఈ రెండూ బోగస్ అని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు. రుణమాఫీని ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసిందన్నారు.

తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీల పట్ల విసిగిపోయారని, రానున్న రోజుల్లో బీజేపీ బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందన్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉంటారని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రజాసమస్యలపై పోరాడుతామన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు ఒకేతాను ముక్కలని, అందుకే గాంధీభవన్, తెలంగాణ భవన్ మధ్య ఎమ్మెల్యేలు చక్కర్లు కొడుతున్నారని అన్నారు.

Advertisement

Next Story