నేడు ఈడీ విచారణకు కవిత.. అరెస్టుపై బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-16 03:08:37.0  )
నేడు ఈడీ విచారణకు కవిత.. అరెస్టుపై బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 11న జరిపిన ఎంక్వయిరీకి కొనసాగింపుగా ఎమ్మెల్సీ కవిత రెండోసారి ఢిల్లీలోని ఈడీ విచారణకు గురువారం హాజరు కానున్నారు. అరెస్టు అనుమానాలతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే కొందరు అక్కడికి చేరుకోగా.. గురువారం ఉదయం మరికొందరు బయలుదేరనున్నారు.

భారత్ జాగృతి, తెలంగాణ జాగృతి కార్యకర్తలు వారం రోజులుగా అక్కడే మకాం వేశారు. ఈడీ అధికారులు కవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది బీఆర్ఎస్ వర్గాలను, జాగృతి వాలంటీర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అరెస్టు చేయడానికి ఈడీ ప్రయత్నిస్తున్నదని స్వయంగా కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం. కాగా నేడు ఉదయం 10 గంటలకు కవిత ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో కవిత ప్రెస్ మీట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

గతంలోనే అరెస్టు భయం..

గత విచారణ సందర్భంగానే కవిత అరెస్టు తప్పదేమోనని భయపడ్డారు. కానీ ఈడీ అధికారులు ఇంటికి పంపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండోసారి విచారణ తర్వాత ఏం జరగనున్నదనే టెన్షన్ వారిలో కంటిన్యూ అవుతున్నది. ఇప్పటికే కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్, కవిత మాజీ వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ అధికారులు బుధవారం ప్రశ్నించారు.

వీరిద్దరినీ కలిపి జాయింట్‌గా విచారించినట్టు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. బుచ్చిబాబును గురువారం కూడా ప్రశ్నించనున్నట్టు తెలిపాయి. గురువారం మధ్యాహ్నానికి పిళ్లయ్ ఈడీ కస్టడీ ముగియనున్నది. దీంతో దానిని మరికొన్ని రోజులు పొడిగించాల్సిందిగా స్పెషల్ కోర్టును ఈడీ రిక్వెస్టు చేయనున్నది. కవితతో పాటు వీరిద్దరినీ కలిపి జాయింట్‌గా విచారించడానికి తగిన ఏర్పాట్లలో ఈడీ నిమగ్నమైంది.

సౌత్ గ్రూపు ఆర్థిక మూలాలపైనే ఫోకస్

లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు పోషించిన పాత్రపైనే ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సుమారు రూ.100 కోట్ల నగదు హవాలా మార్గంలో ఢిల్లీకి చేరడాన్ని సీరియస్‌గా తీసుకున్నది. లెక్కల్లోకి రాని ఈ డబ్బు గురించే ఆరా తీస్తున్నది. కవిత ఆదేశాల మేరకు రూ.కోటి ఇచ్చినట్టు వెన్నమనేని శ్రీనివాసరావు తన స్టేట్‌మెంట్‌లో ప్రస్తావించారు. సౌత్ గ్రూపులో కవిత తరఫున ప్రతినిధిగా వ్యవహరించానని పిళ్లయ్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో ఆర్థికంగా ఒనగూరే ప్రయోజనాలపై కసరత్తు చేసి అభిప్రాయాలను వెల్లడించినట్టు బుచ్చిబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు తరపున ఈ ముగ్గురికీ ప్రమేయం ఉన్నట్టు ఈడీ నిర్ధారణకు వచ్చింది. ఈ గ్రూపులోని మాగుంట రాఘవ, శరత్‌చంద్రారెడ్డిను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది.

డబ్బు ఎవరిది?

చేతులు మారిన డబ్బు ఎవరిది? ఎవరికి చేరింది? అనే అంశాలపై వారి నుంచే ఈడీ సమాధానాన్ని రాబట్టాలనుకుంటున్నది. వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, వారి మధ్య ఉన్న బిజినెస్ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, లిక్కర్ స్కామ్‌లో ఒక దగ్గరికి ఎలా చేరారు, ఎక్కడెక్కడ ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నారు, వాటిలో ఏం చర్చించుకున్నారు, కిక్‌బ్యాక్ రూపంలో ఎవరికి ఎంతెంత ముట్టింది, కోట్లాది రూపాయల నగదు రవాణాతో మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలు ఏ మేరకు జరిగాయి.

ఇలాంటివాటిపైనే ఈడీ దృష్టి సారించింది. మొబైల్ ఫోన్లలో వాట్సాప్, సిగ్నల్ యాప్, ఫేస్‌టైమ్ లాంటి అప్లికేషన్ల ద్వారా జరిగిన సంభాషణలు, డాక్యుమెంట్ల షేరింగ్ తదితరాలపై అధ్యయనం చేసిన ఈడీ.. డిజిటల్ ఎవిడెన్సులను మొత్తం 31 మంది మాయం చేసినట్టు గుర్తించింది. కవిత సైతం పది ఫోన్లను మార్చారని, వాటిలో ఆధారాలను ధ్వంసం చేశారన్నది ఈడీ ఆరోపణ.

జాయింట్ ఎంక్వయిరీతో వాస్తవాలు వెలుగులోకి...?

ఇప్పటికే బుచ్చిబాబు, పిళ్లయ్, కవిత నుంచి విడివిడిగా సేకరించిన వివరాల్లో సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో వారిని జాయింట్‌గా విచారించాల్సిన అవసరం ఉన్నదని ఈడీ భావిస్తున్నది. గత విచారణ సందర్భంగానే పిళ్లయ్‌తో కలిపి కవితను విచారించినట్టు వార్తలు వచ్చినా ఈడీ వర్గాలు దానిని ధ్రువీకరించలేదు. కవిత సైతం సుప్రీంకోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో అలాంటి జాయింట్ మీటింగ్ జరగలేదని పేర్కొన్నారు.

ఈసారి జాయింట్ మీటింగ్ ద్వారా ఈడీ అదనపు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నది. ఎవరు ఏ అంశాన్ని దాస్తున్నారనేది విషయాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నది. విచారణలో కవిత వెల్లడించే వివరాలకు అనుగుణంగా ఈడీ తదుపరి చర్య ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. పిళ్లయ్, బుచ్చిబాబును గతంలోనే పలుమార్లు ఈడీ విచారించింది. వారి నుంచి వివరాలను రాబట్టింది. స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేసింది.

వారం రోజులుగా పిళ్లయ్ కస్టడీలో ఉన్నందున తాజాగా వెల్లడించిన అంశాలను కూడా కవిత ఎంక్వయిరీ సందర్భంగా ఈడీ అధికారులు నిలదీసే అవకాశమున్నది. జాయింట్ విచారణ సందర్భంగా పిళ్లయ్, బుచ్చిబాబు గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్లకు భిన్నంగా జవాబు ఇచ్చినట్లయితే వాటిని ప్రింట్, వీడియో ఫుటేజీని చూపి నిలదీసే చాన్స్ లేకపోలేదు. లిక్కర్ స్కామ్‌లో ముడుపులన్నీ ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు చేరినట్టు ఈడీ అంచనాకు వచ్చినందున ఇప్పటికే కస్టడీలో ఉన్న ఆయనను కూడా అవసరాన్ని బట్టి ఈ ముగ్గురి ఎంక్వయిరీకి హాజరు పరిచే అవకాశాన్నీ ఈడీ పరిశీలిస్తున్నది.

Also Read: కవితకి మద్దతివ్వడం నేరమే!

Advertisement

Next Story