Vemulawada MLA : రాజన్న ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తాం

by Aamani |
Vemulawada MLA : రాజన్న ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తాం
X

దిశ,వేములవాడ : దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. శనివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ నమూనాలను పరిశీలించి,ఆలయ అభివృద్ధి పనులపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆలయ అధికారులతో కలిసి ఆలయ ఈ.ఓ గెస్ట్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ ఆలయంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు, మెరుగైన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆహ్లాదకర వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆలయ అభివృద్ధి పనులను శృంగేరి పీఠం, పండితులు, భక్తుల సూచనల మేరకు చేపట్టి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. గతంలో శృంగేరి పీఠాన్నీ సందర్శించినపుడు ఆలయ విస్తరణ నమూనాతో రావాలని వారు తెలిపారని ఆది గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 50 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ విస్తరణ పై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు..ఈ క్రమంలో త్వరలో శృంగేరి పీఠాన్ని సందర్శించి ఆలయ విస్తరణ పై నమూనాలను శృంగేరి పీఠాధిపతి ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామి వారిని కలిసి వారి సూచనలు సలహాల ప్రకారం ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విస్తరణ చేపడతామని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికత ఉట్టి పడేలా ఆలయాన్ని విస్తరిస్తామని తెలిపారు.

జీవో నెంబర్ 149 రద్దు పై చర్చ..

సమావేశంలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో నూతనంగా 1000 మీటర్ల (కిలోమీటర్ల ) పరిధిలో చేపట్టబోయే నిర్మాణాలపై ఇచ్చిన జీవో నెంబర్ 149 రద్దు పై చర్చించారు. ఈ జివో వలన పట్టణంలో ఆలయం పరిసరాలలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.. జీవో నంబర్ 149 రద్దుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వేములవాడ పట్టణంతో పాటు ఆలయ అభివృద్ధి పై ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డి.ఈ రఘునందన్, ఏ.ఈ.ఓ లు బ్రహ్మణగారి శ్రీనివాస్, జి.రమేష్ బాబు,ఇంచార్జ్ స్థాపనాచార్య ఎన్. ఉమేష్ , ప్రధాన అర్చకులు సురేష్, ఉప ప్రధానార్చకులు సి.హెచ్ శరత్ , ఏ.ఈ రామ్ కిషన్ రావు, ఎడ్ల శివ సాయి, వంశీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed