Vemulawada MLA : రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోంది

by Aamani |
Vemulawada MLA : రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోంది
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద అమరవీరుల స్థూపానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయ భవన ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నాటి హైదరాబాద్ సంస్థానం 17 సెప్టెంబర్ 1948లో భారత దేశంలో ఐక్యమై ఇప్పటికీ 76 వసంతాలు పూర్తి చేసుకుని 77 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును ప్రభుత్వం ప్రజా పాలన వేడుకలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమై, స్వీయ అస్తిత్వం కోసం 60 ఏళ్లు ఉద్యమించి స్వరాష్టంగా అవతరించిందన్నారు. ఇప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి, రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శనంలో ఇచ్చిన 6 గ్యారంటీలు పక్కగా అమలవుతున్నాయన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ అమలుతో తెలంగాణ రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్ళుగా మార్చబోతున్నామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సం కల్పించిందన్నారు. పాఠశాలలో తెలిసిన రోజునే విద్యార్థులందరికీ యూనిఫామ్ లు, పాఠ్యపుస్తకాలు అందజేశామని, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ లను నిర్మించబోతున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచడానికి ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం ముగ్గురికి కారుణ్య నియామకాల పత్రాలు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రమేష్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మొహినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed