రైతన్నల్లారా జాగ్రత్త: పత్తి చేన్లలో దొంగలు

by Satheesh |   ( Updated:2022-12-03 15:00:42.0  )
రైతన్నల్లారా జాగ్రత్త: పత్తి చేన్లలో దొంగలు
X

దిశ, వెల్గటూర్: ఊర్లో దొంగలు పడ్డారని.. ఫలానా వారి ఇంట్లో దొంగలు పడ్డారని.. లేదా దుకాణాల్లో దొంగలు పడ్డారని వార్తలు వింటుంటాం. దొంగలు విలువైన వస్తువులు, డబ్బులు, బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారనే మాటను మనం తరచుగా వార్తల్లో వింటాం, చూస్తాం. కానీ ఇక్కడ దొంగలు తమ రూట్ మార్చుకొని వెరైటీగా చోరీ చేస్తున్నారు. అర్థరాత్రి వేళ పత్తి చేన్లలో చొరబడి తెల్ల బంగారాన్ని దోచుకెళ్తున్నారు. వివరాల ప్రకారం.. గత వారం రోజులుగా వెల్గటూర్, ఎండపల్లి మండలాల్లో ఎక్కడ చూసిన పత్తి దొంగల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఎండపల్లి మండలం కేంద్రంలోని గుర్రం సత్యనారాయణ రెడ్డి, మారం మల్లారెడ్డి, అదేవిధంగా వెల్గటూరు మండలం రాజక్క పల్లి గ్రామానికి చెందిన ఓ రైతు చేనులో దొంగలు పడి పత్తి ఏరుకొని వెళ్లినట్లు సమాచారం.

దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా చేతికి వచ్చే సమయానికి దొంగల పాలవుతోందని.. అన్ని సమస్యలను తట్టుకుని చివరకు తెల్ల బంగారాన్ని తెంపుకుని ఇంటికి తెచ్చుకుందాం అన్న సమయంలో దొంగల బారిన పడి నిండా మునిగిపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల అసలే దిగుబడి తక్కువగా వస్తుందని.. వచ్చే కాస్త దిగుబడికి దొంగలు దాపురించడం రైతులను మరింత కలవరపెడుతుంది.

ఈ ఏడాది పత్తి దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్లో క్వింటాకు సుమారుగా రూ.10,000 ధర పలుకుతుండడం వల్ల.. దొంగలు తమ దృష్టిని పత్తి చేళ్ల వైపు మళ్ళించారు. అర్ధరాత్రి దాటాక ఓ గంటసేపు కష్టపడి పత్తిని ఏరుకుంటే సులభంగా 10,000 సంపాదించొచ్చని.. దొంగలు ఈ రూట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా, తొలి దశలోనే ఈ పత్తి దొంగలకు చెక్ పెట్టకపోతే.. ముందు ముందు రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని.. ఈ విషయంలో పోలీసులు దృష్టి సారించి పత్తి దొంగలను పట్టుకొని తమకు నష్టం జరగకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed