ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం

by Sridhar Babu |   ( Updated:2024-09-11 15:17:24.0  )
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం
X

దిశ, వెల్గటూర్ : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉండి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నా ప్రతి పక్షాలు ప్రభుత్వంపై బురుద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ప్రభుత్వ విప్​ ఆడ్లూరి లక్ష్మణ్​ కుమార్ మండిపడ్డారు. వెల్గటూర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్లంపల్లి నిర్వాసితులకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...దశాబ్ద కాలంగా ఎల్లంపల్లి నిర్వాసితులకు పెండింగ్ లో ఉన్న పరిహారాన్ని మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పదేళ్ల పాటు నిర్వాసితుల గురించి పట్టించుకోని ప్రతిపక్షాలు ఇప్పుడు తమ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.

వెల్గటూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మండలానికి చెందిన 45,05,220 రూపాయల విలువ గల 45 చెక్కులను అలాగే ఎండపెల్లి మండలానికి చెందిన 31,03,596 రూపాయల విలువ గల 31 కళ్యాణ లక్ష్మి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు విప్​ పంపిణీ చేశారు. అలాగే 24 మంది ముక్కట్రావుపేట్ గ్రామ ఎల్లంపల్లి నిర్వాసిత కుటుంబాలకు 52 లక్షల విలువ గల చెక్కులను ఆర్డీఓ మధుసూధన్ గౌడ్ తో కలిసి పంపిణీ చేశారు. శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులైన ముక్కట్రావు పేట గ్రామానికి చెందిన 24 మంది కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరైన పరిహారం చెక్కులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, పరిహారం అందని వారు ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే చెగ్యామ్ గ్రామానికి చెందిన 126 భూ నిర్వాసితుల కుటుంబాలకు చెందిన 18 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, ఎమ్మార్వో శేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story