కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి..

by Sumithra |
కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి..
X

దిశ, కరీంనగర్ టౌన్ : జిల్లాకు తలమాణికంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు, జంక్షన్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు. ఆదివారం కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను, తెలంగాణ చౌక్ లోని జంక్షన్ నిర్మాణ పనులను నగర మేయర్, సంబందిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. చారిత్రక నేపథ్యంతో ఉన్న కరీంనగర్ జిల్లా ప్రగతిని అంతకంతకు పెంచుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటక రంగాన్ని ఆకర్షిస్తూ, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేసి అతిత్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు పనుల్లో వేగం పెంచాలని అన్నారు.

డైనమిక్ లైట్ల పనులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ చౌక్ కూడలిలో జరుగుతున్న ఐలాండ్ సుందరీకరణ పనులను పరిశీలించారు. జంక్షన్ల నిర్మాణంలో వేగం పెంచాలని, కాంట్రాక్టర్ కు తగుసూచనలు చేశారు. గడిచిన ఐదేళ్లలో కరీంనగర్‌ రూపురేఖలు చాలా మారిపోయాయని, ఇప్పటికే కమాన్‌ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్‌ జంక్షన్‌, కోర్టు జంక్షన్లను సుందరీకరించగా, తాజాగా 6.5 కోట్లతో ప్రధాన జంక్షన్లను సుందరీకరించేందుకు స్మార్ట్‌సిటీలో ప్రణాళికలు రూపొందించమన్నారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న 13 జంక్షన్లను చారిత్రక, ఆధ్యాత్మిక, ధార్మిక ఘట్టాలతో కూడిన విగ్రహాలతో పాటు ఆకట్టుకునే రీతిలో వివిధ ఆకృతులతో జంక్షన్లను సుందరీకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ చౌక్‌లో ఇందిరాగాంధీ విగ్రహం ఐలాండ్‌ను అందంగా తీర్చిదిద్దనున్నామని, కరీంనగర్‌కు ముఖద్వారంగా నిలిచే అల్గునూర్‌ జంక్షన్‌, బద్దం ఎల్లారెడ్డి జంక్షన్‌ విస్తరించి సుందరీకరణ పనులు చేపడతారు. కార్ఖానగడ్డ నాకా చౌరస్తాలోని జంక్షన్‌ను కుదించి మరింత అందంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. కొత్తగా కాపువాడ, ఓల్డ్‌పవర్‌హౌజ్‌, బొమ్మకల్‌ జంక్షన్‌, పద్మనగర్‌ జంక్షన్‌తోపాటు కార్పొరేషన్‌లో విలీనమైన సదాశివపల్లి, వల్లంపహాడ్‌లో, ప్రస్తుతం వన్‌టౌన్‌ ఎదురుగా ఉన్న జంక్షన్‌, కోతిరాంపూర్‌ జంక్షన్‌, బైపాస్‌రోడ్డులో నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జికి ఇరువైపులా మహాభారతం వంటి చారిత్రక నేపథ్యంతో కూడిన విగ్రహాలతో జంక్షన్లను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డీఈ మసూద్, ఆర్ అండ్ బీ ఏఈ రాజశేఖర్ కార్పొరేటర్లు వాల రమణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేన మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story