కమనీయంగా రాములోరి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్

by Disha Web Desk 23 |
కమనీయంగా రాములోరి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్
X

దిశ,జమ్మికుంట: ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ కళ్యాణ వేదిక వద్ద బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముత్యాల తలంబ్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా, కమనీయంగా జరిగింది. సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీ రామచంద్ర మూర్తి ఉత్సవమూర్తులను ఆలయ గర్భగుడిలో నుండి పల్లకిలో మంగళ వాయిద్యాల నడుమ ఎదుర్కొల్ల మండపానికి తీసుకువచ్చి అక్కడనుండి 12.05 నిమిషాలకు కళ్యాణ కళ్యాణ మండప వేదిక పైకి తీసుకువచ్చి, 12.46 నిమిషాలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కళ్యాణ క్రతువును శాషోత్రంగా దేవాలయ ఈవో కందుల సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, తహసీల్దార్ రాణి లు పాల్గొనగా, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని తదితరులు కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు.

రామనామ స్మరణలతో దద్దరిల్లిన ఆలయం..

కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలిరాగా, ఆలయ గర్భగుడి ప్రాంతం తో పాటు కళ్యాణ వేదిక తదితర ప్రాంతాలు భక్తుల రామ నామ స్మరణలతో దద్దరిల్లిపోయింది.

భారీగా పోలీసు బందోబస్తు..

కళ్యాణ మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ పర్యవేక్షణలో జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్ , ఇల్లంతకుంట ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మహా అన్నదాన కార్యక్రమం..

జమ్మికుంట కాటన్ మిల్లర్స్, పారా బాయిల్డ్ మిల్లర్స్, రా రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed