తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే ఈటల రాజేందర్

by Shiva |
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే ఈటల రాజేందర్
X

దిశ, హుజూరాబాద్: అకాల వర్షంతో చేతికందిన పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బస్తా వరి ధాన్యంపై 600 గ్రాములు కటింగ్ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి స్పష్టం చేసినా, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని ఓ రైతుగా చెప్పానన్న స్పీకర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరారు. కొనుగోలు కేంద్రాలను ముందస్తు ప్రారంభించకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిచి మొలకెత్తడంతో రైతు కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయన్నారు.

మిల్లులు తక్కువగా కేటాయించడం వల్ల ధాన్యం దిగుమతి కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ మద్దతు ధర కన్నా తక్కువ ధరకే వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయిస్తూ రైతులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయాలపై మాట్లాడిన విపక్షాల నాయకులపై ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

బొందలగడ్డగా మానేరు..

ఇసుక అక్రమ రవాణాతో హుజూరాబాద్, మానకొండూర్, పెద్దపల్లి నియోజకవర్గాల పరిధిలోని మానేరు వాగు బొందలగడ్డగా మారుతోందని ఎమ్మెల్యే ఈటల అన్నారు. వందల లారీలలో ఇసుక తరలించడంతో రోడ్లన్ని ధ్వంసం అయ్యాయని ఆరోపించారు. కొంతమంది అధికారులు మామూళ్ల మత్తులో ఇసుక మాఫియాకు అండగా ఉంటున్నారన్నారు. ఈ ప్రాంతమంతా ఎడారిగా మారక ముందే అక్రమ ఇసుక రవాణా ఆపివేయాలని ఈటల డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జూపాక సింగిల్ విండో చైర్మెన్ ఆలుమల్ల శ్యాంసుందర్ రెడ్డి, గంగిశెట్టి రాజు, విజేందర్ రెడ్డి, కాశిరెడ్డి మహిపాల్ రెడ్డి, మండల సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed