రాజీవ్ యువ వికాస్ పథకం గడువు పెంచినట్టా.. లేనట్టా

by Sumithra |
రాజీవ్ యువ వికాస్ పథకం గడువు పెంచినట్టా.. లేనట్టా
X

దిశ, గొల్లపల్లి : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించేందుకు తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాస్ పథకం ఆన్లైన్ దరఖాస్తుల గడువు సోమవారంతో (నిన్నటి) ముగుస్తుండగా మరోసారి పొడిగిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ తీరా దరఖాస్తు చేసుకుందామని సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయడంతో దరఖాస్తు గడువు 14వ తేదీతో ముగిసిందని, వెబ్సైట్ క్లోజ్ చేశామనే సమాచారంతో నిరుద్యోగుల్లో గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన ఐదు లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడంలోని పలుసమస్యలను గుర్తించిన ప్రభుత్వం తొలుత ఈనెల 14 వరకు గడువు పొడిగించినప్పటికీ చివరి మూడు రోజుల నుండి సర్వర్ ప్రాబ్లంతో అనేక మంది నిరుద్యోగులు దరఖాస్తూ చేసుకోలేకపోయారు. దీంతో మరోసారి ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో నిరుద్యోగులు సంతోషించారు. కానీ దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవకి వెళ్లి ప్రయత్నించగా సంబంధిత వెబ్సైట్ లో మాత్రం దరఖాస్తు గడువు ముగిసిందని ఉండడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Next Story