అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి

by Sridhar Babu |
అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి
X

దిశ, జమ్మికుంట : ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే జాతర ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆలయ ప్రాశస్త్రానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని, ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు. సీతారామ కళ్యాణం రోజు తలంబ్రాల ఘట్టాన్ని భక్తులు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీతారాముల కళ్యాణం రోజు, చిన్న రథం, పెద్ద రథం జరిగే రోజుల్లో పోలీసులు ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాజకీయాలకు తావులేదు : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి భక్తి సేవలో రాజకీయాలకు తాగు లేకుండా అందరూ కలిసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. జాతరలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఉమ్మడి జమ్మికుంట మండల మిల్లర్లు సహాయ, సహకారాలు అందించాలని సూచించారు.

ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ, తహసీల్దార్ రాణి, ఎంపీడీఓ పుల్లయ్య, ఆలయ ఇన్చార్జి ఈఓ సుధాకర్, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లు మహమ్మద్ అయాజ్, సమ్మయ్య, ఇల్లందకుంట ఎస్సై రాజకుమార్ లతోపాటు జమ్మికుంట ఉమ్మడి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed