- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లాసిఫికేషన్ మార్పు కలెక్టర్ల ఇష్టమా.. పట్టాగా మారిన బిలాదాఖలా భూములు
దిశ, తెలంగాణ బ్యూరో : ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వ భూములుగా ఉన్న వాటిని పట్టా భూములంటూ కొందరు కలెక్టర్లు ప్రొసీడింగ్స్ జారీ చేశారు. బిలాదాఖలా భూములను సైతం దారదత్తం చేసేశారు. కొన్నింటికి అయితే ఎలాంటి ఆర్డర్ కాపీలు లేకుండానే పట్టాగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. క్లాసిఫికేషన్ ఛేంజెస్‌లో కొందరు కలెక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో క్లాసిఫికేషన్ ఛేంజ్‌కు సంబంధించి వందలాది ఫైళ్లను తిరిగి విచారించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
కలెక్టర్ అమోయ్ నిర్వాకం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ప్రతిపాదించిన భూమిని పట్టాగా మార్చేయడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సర్వే నం.129, 142లోని బిలాదాఖలా భూములను పట్టా భూములుగా మార్చేశారు. డేటా కరెక్షన్ కింద ధరణి పోర్టల్‌లో అప్లయ్ చేసుకున్నారని, తాము విచారించి రెవెన్యూ రికార్డుల ప్రకారమే కరెక్షన్ చేస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో అప్పటి కలెక్టర్ డి.అమోయ్ కుమార్ ప్రొసీడింగ్స్ డీ/4391/05/2022 జారీ చేశారు. అయితే, గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు సేత్వార్‌ను ఆధారంగా చేసుకుని దరఖాస్తులను తిరస్కరించగా, ఈయన మాత్రం అకర్ బంద్ రిజిస్టర్ పట్టుకొచ్చి అందులో పట్టా ఉందంటూ సమర్ధించారు. రెండు రిజిస్టర్లలో వేరువేరుగా ఉందని చెబుతూనే అకర్ బంద్ రిజిస్టర్‌ను ప్రామాణికంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనేక లావాదేవీలు జరిగాయని, మార్ట్ గేజ్ కూడా చేశారని ప్రస్తావించారు. అందుకే డేటా కరెక్షన్ కోసం పెట్టుకున్న అప్లికేషను అప్రూవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత పనులు చకచకా పూర్తయ్యాయి. సేత్వార్ నుంచి 2016–17 వరకు సర్కారీగా, బిలాదాఖలాగా కనిపించిన భూములు ఇప్పుడు పట్టాగా మారిపోయాయి.
గతంలో రిజెక్ట్ చేసిన అధికారులు
సుల్తాన్‌పల్లి సర్వే నం.129లో 16.24 ఎకరాలు, 142లో 8.26 ఎకరాలు రెవెన్యూ రికార్డుల ప్రకారం బిలాదాఖలాగా ఉన్నది. ఎమ్మార్వో రెఫరెన్స్ నం.ఎ/1663/2005, తేదీ.22.06.2005 ముగ్గురికి విరాసత్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. అయితే, ఎంక్వయిరీ చేస్తే ఆ భూములు బిలాదాఖలాగా తేలింది. రెవెన్యూ కోర్టుల్లో కేసులు నడిచాయి. ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించారు. అయితే, 1964–65 రికార్డుల్లోనూ సర్కారీగా ఉండగా, అప్పటి నుంచి ఎవరికీ ఖాతా కేటాయించలేదు. అందుకే ఎమ్మార్వో సక్సేషన్ చేయాలన్న రెఫరెన్స్ అప్లికేబుల్ కాదని అప్పటి చేవెళ్ల ఆర్డీవో ప్రొసీడింగ్స్ నం.సీ/1031/2007, తేదీ.04.08.2007 ని జారీ చేశారు. దాని ప్రకారం ఆ ముగ్గురికి ఎమ్మార్వో జారీ చేసిన ఎ/1663/2005 రద్దు అయింది.
ప్రస్తుతం వీరి పేరిట..
శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లి రెవెన్యూ సర్వే నం.129/1/1లో రెండు ఎకరాలు, తోట మౌనిక దీప్తి పేరిట, సర్వే నం.129/1/2లో 6.12 ఎకరాలు, 129/2లో 8.12 ఎకరాలు (మొత్తం 14.24 ఎకరాలు) ఎడ్ల క్రిష్ణారెడ్డి పేరిట రాశారు. సర్వే నం.142/1లో 4.13 ఎకరాలు, 142/2/2లో 2.03 ఎకరాలు ఎడ్ల క్రిష్ణారెడ్డి పేరిట, సర్వే నం.142/2/1లో 2.10 ఎకరాలు చంద్రశేఖర్ కాసుల పేరిట రాసేశారు. అయితే, అంతకు ముందు రెవెన్యూ రికార్డుల్లోని పొరంబోకు, సర్కారీ అనే పదాలను ఏకపక్షంగా తొలగించి పట్టా భూములుగా మార్చేయడం గమనార్హం.
అలా ఎలా మార్చారో మరి!
బిలాదాఖలాగా అనేక దశాబ్దాలుగా రికార్డుల్లో కొనసాగిన భూములను పట్టాగా మార్చేందుకు ఏ చట్టం, ఏ మంత్రివర్గ ఆమోదం తీసుకున్నారో అర్థం కావడం లేదు. అయితే, అనేక మంది తహసీల్దార్లు, ఆర్డీవోలు మాత్రం పట్టాగా మార్చేందుకు ససేమిరా అన్నట్లు ఆధారాలు ఉన్నాయి. పైగా ఈ భూముల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడానికి అనువుగా ఉంటుందంటూ గతంలో పనిచేసిన అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. కానీ ధరణి పోర్టల్‌లోని లోపాలను అడ్డు పెట్టుకుని సర్కారీ భూములను చేజిక్కించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.కోట్లు విలువ చేసే భూములను కాపాడాల్సిన ఐఏఎస్ అధికారులు సైతం కొందరికి వత్తాసు పలికారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ సర్కారు అధికారాలను కేంద్రీకృతం చేయడం, కలెక్టర్లు, సీసీఎల్ఏకు కట్టబెట్టడంతో వాళ్లు ఆడిందే ఆటగా సాగిందనే విమర్శలున్నాయి. అందుకే ఎలాంటి ఆధారాలు లేకపోయినా విచక్షణాధికారాలను అడ్డం పెట్టుకొని క్లాసిఫికేషన్ చేంజ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటి వెనక అప్పటి లీడర్లు, వారి కంపెనీలు ఉన్నట్లు తెలుస్తుంది.