రైళ్లలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న దొంగలు అరెస్టు

by Sridhar Babu |   ( Updated:2024-02-17 15:06:00.0  )
రైళ్లలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న దొంగలు అరెస్టు
X

దిశ, సికింద్రాబాద్ : రైళ్లలో ప్రయాణిస్తూ సెల్ఫోన్లు దొంగిలిస్తున్న అంతరాష్ర్ట ముఠాను సికింద్రాబాద్​ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువ చేసే 67 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్, రూ.10వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం రైల్వే ఎస్పీ షేక్ సలీమా సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుక్కుగూడలో నివాసముంటూ సోలార్ రిపేర్ పనులు చేస్తున్న వరంగల్ జిల్లా ఉప్పులకు చెందిన బోనగంటి చైతన్య(26), అమీర్ పేట్ ఎల్లారెడ్డి గూడలో నివాసముండే మహ్మద్ రియాజ్హుస్సేన్(34), నాగారం రాంపల్లిలో ఉంటూ జీహెచ్ఎంసీ డ్రైవర్గా పనిచేస్తున్న కర్నాటక, బీదర్కు చెందిన మానిక్ ప్రకాష్ తెలంగ్యా అలియాస్ బాలు(22), బంజారాహిల్స్​కు

చెందిన యోగి శంకర్ యాదవ్(35), మహారాష్ర్టకు చెందిన గణేష్ దిలిప్ పాటిల్(42), క్యాటరింగ్ పనులు చేసే రాజేంద్రనగర్ కాటేదాన్​కు చెందిన నడికుడి మాణిక్యం(44), అఫ్జల్గంజ్​కు చెందిన మొబైల్రిపేరర్ సురేంద్రసింగ్ రాజ్పుత్(26) వేరు వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. పనిచేస్తే వచ్చే డబ్బులు అవసరాలకు సరిపోక పోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలని, రైళ్లలో సెల్ఫోన్లు కొట్టేస్తే అధిక డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. వేరు వేరు ప్రాంతాలకు చెందిన వీరంతా చోరీలు చేసేందుకు వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలుసుకుని ఒక ముఠాగా ఏర్పడ్డారు. రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫారాలపై తిరుగుతూ ప్రయాణికులు హడావిడిగా రైలు ఎక్కుతున్నసమయంలో వారి సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నారు. ఇలా దొంగిలించిన సెల్పోన్లను విక్రయించి వచ్చిన డబ్బులను సమానంగా పంచుకుని జల్సాలు చేస్తున్నారు.

బోనగంటి చైనత్య, మహ్మద్ రియాజ్హుస్సేన్, మాణిక్ప్రకాష్ తెలంగ్యా, యోగీ శంర్ యాదవ్​లు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సెల్ఫోన్లు చోరీ చేసి వాటిని గణేష్ దిలిప్ పాటిల్, నడికుడి మాణిక్యం, సురేందర్సింగ్ రాజ్​పుత్లకు ఇస్తారు. ఇలా ఇచ్చిన సెల్ఫోన్లను ఈ ముగ్గురు కలిసి వాటిని మహారాష్ట్ర, హైదరాబాద్లో విక్రయిస్తుంటారు. ఇలా విక్రయించిన సొమ్మును అందరూ సమంగా పంచుకుని జల్సాలు చేస్తుంటారు. ఇదే క్రమంలో గతేడాది డిసెంబర్​ 30న దొంగల్లో ఒకరైన మాణిక్ లాలాగూడ రైల్వే స్టేషన్ వద్ద ట్రాప్ పక్కన చేతిలో ఒక కర్రతో నిలబడి ఉదయం పూట సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న ఇంటర్ సిటీ ఎక్స్​ప్రెస్ లాలాగూడ రైల్వేస్టేషన్ సమీపంలో నెమ్మదిగా వెళుతుండగా అదే సమయంలో ప్రయాణికుడు డోరు వద్ద నిలబడి సెల్ ఫోన్లో మాట్లాడటాన్ని గమనించి అతని చేతిపై కర్రతో కొట్టడంతో ఆ వ్యక్తి రైలు నుంచి కింపడిపోయాడు.

వెంటనే అతని వద్ద ఉన్న సెల్​ఫోన్​ను లాక్కొని ఉడాయించారు. గత నెల 15న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడుకున్న ఓ ప్రయాణికుడి బ్యాగును కొట్టేసి అందులో ఉన్న డబ్బు, సెల్ఫోన్ను దొంగిలించారు. అలాగే ఈనెల 10న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​కు చేరుకున్న దొంగలు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఓ ప్రయాణికుడు తన ల్యాప్టాప్ బ్యాగును బెంచ్​పై పెట్టి నల్లా వద్ద ముఖం కడుక్కుంటున్న సమయంలో ఆ బ్యాగును కొట్టేసి ఉడాయించారు. అందులో ఉన్న సెల్ఫోన్ , డబ్బులు, ల్యాప్టాప్​ తీసుకున్నారు. అయితే బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు రైల్వేస్టేషన్లో నిఘాపెంచారు. శనివారం విశ్వసనీయ సమాచారంతో రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్, ఎస్ఐలు ఎంఏ మాజీద్, రమేష్ ఇతర పోలీసులతో కలిసి ఒకటవ నంబరు

ప్లాట్ ఫారంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువ చేసే 67 సెల్ఫోన్లు, ఒక ల్యాప్టాప్, రూ.10వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఆరుగురిని రైల్వే కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్​కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు మహారాష్ట్రకు చెందిన గణేష్ దిలిప్ పాటిట్​ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ షేక్ సలీమా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెల్ఫోన్లు పోగొట్టుకున్నవారు వాటి విలువతో సంబంధం లేకుండా తమకు ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా దుండగులను సులువుగా గుర్తించే వీలు ఉంటుందన్నారు. దీని వల్ల పోగొట్టుకున్న సెల్ఫోన్లు తిరిగి లభించడమే కాకుండా ఇలాంటి దొంగతనాలకు చెక్​ పెట్టవచ్చని చెప్పారు.

Read More..

నాకు ఎస్ఓటీలో డ్యూటీ చేయాలని ఉంది.. ఇది పోలీసు ఆశవాహుల కోరిక..

Advertisement

Next Story

Most Viewed