Hyderabad brand: సిటీ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా చర్యలు: మంత్రి పొన్నం ప్రభాకర్

by Mahesh |
Hyderabad brand: సిటీ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా చర్యలు: మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వకుండా, సమష్టిగా పని చేసి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్ అభివృద్ధి పై ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గకుండా మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నగరానికి కావాల్సిన అవసరాలపై మంత్రి సోమవారం హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయాలకతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. నగర అభివృద్ధికి కావలసిన అవసరాలు, నిధులు, పెండింగ్ బిల్లులు, నగరంలో జరుగుతున్న ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పనుల పురోగతి తదితర అంశాలపై విజ్ఞప్తి చేయాలని సమావేశంలో చర్చించారు.

నగరంలో డెంగీ కేసులు రాకుండా వైద్యాధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, నీరు నిల్వ ఉండకుండా జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ విభాగాలకు చెందిన పనులను, పలు సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకేళ్లనున్నట్లు మంత్రి వెల్లడించారు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, స్కూల్‌లు తదితర వాటిపై ఎమ్మెల్యేలు అధికారులు తనిఖీ చేపట్టాలని, అప్పుడే విద్యార్థులకు భరోసా ఇవ్వగలమని మంత్రి అభిప్రాయపడ్డారు. నగరంలో స్కూళ్లలో ఉన్న పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కంటోన్మెంట్‌లో నీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని ఎమ్మెల్యే శ్రీగణేశ్ మంత్రి దృష్టికి తీసుకురాగా, పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నగర ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎంఐఎం ఎమ్మెల్యేలు మహమ్మద్ మొబిన్, కౌసర్ మోహినుద్దీన్, అబ్దుల్లా బలాల, మాజిద్ హుస్సేన్, జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ఎంఎస్ ప్రభాకర్ రావు, మీర్జా రియాజ్ ఉల్ హుస్సేన్, మీర్జా రెహ్మాన్, తదితరులు పాల్గొన్నారు.



Next Story