కన్నుల పండువగా శ్రీరామ శోభాయాత్ర

by Disha Web Desk 15 |
కన్నుల పండువగా  శ్రీరామ శోభాయాత్ర
X

దిశ, కార్వాన్ : శ్రీరామనవమిని పురస్కరించుకుని నగరంలో బుధవారం నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది రామ భక్తులు ఇందులో పాల్గొన్నారు. యాత్ర సాగే నగర వీధులన్నీ కాషాయమయమయ్యాయి. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో ఎండను సైతం లెక్కచేయకుండా

జై శ్రీరామ్ అంటూ రామభక్తులు చేసిన నినాదాల మధ్య యాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. శోభాయాత్రను చూసేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. జలమండలి ఆధ్వర్యంలో మంచినీటిని సరఫరా చేశారు. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు , వ్యాపార సంఘాలు స్వాగత వేదికలు ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాద వితరణ చేశాయి. పోలీసుల ఆంక్షల మధ్య గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ ఆధ్వర్యంలో గంగాబౌలి ఆకాశపురి హనుమాన్ టెంపుల్ వద్ద నుండి మరో శోభాయాత్ర మొదలైంది.

భారీ పోలీస్ బందోబస్తు...

సీతారాంబాగ్ నుండి సుమారు 6.8 కిలోమీటర్ల మేర శ్రీరామ శోభాయాత్ర కొనసాగింది . నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి , అదనపు సీపీ విక్రమ్ మాన్ సింగ్ లు యాత్రను పర్యవేక్షించారు. యాత్ర కోసం సుమారు 3 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు.

సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి , అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ తో సహా ఇతర పోలీసులు ఉన్నతాధికారులు యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు దీనిని గుర్తుంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీస్ అధికారులు సూచించారు. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయంలో హోమం, ప్రత్యేక పూజల అనంతరం మొదలైంది.

ప్రత్యేక ఆకర్షణగా విగ్రహాలు...

శ్రీరామ శోభాయాత్రలో భారీ హనుమంతుడు, భరత మాత, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒగ్గు కళాకారులు తమదైన శైలిలో నృత్యాలు చేశారు. ఒంటెలు కూడా ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీరామ భజనల మధ్య ధూల్ పేట్, జాలీ హనుమాన్, చుడీ బజార్, గౌలి గూడ మీదుగా హనుమాన్ టేక్డీ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘాతో పాటు మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంహనీయ సంఘటనలు లేవు : డీసీపీ రావుల గిరిధర్

శ్రీరామ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఆయన యాత్ర సాగుతున్న తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాను మొత్తం పోలీస్ టీం వాచ్ చేస్తోందని, విద్వేశాలు రెచ్చగొట్టేలా అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తులతో శోభాయాత్ర చాలా రద్ధీగా ఉందన్నారు. పోలీసు బృందాలతో పాటు షీ టీమ్స్ యాత్ర మొత్తంలో ఉన్నారని, మఫ్టీలో కూడా కొనసాగుతున్నారని వెల్లడించారు.

ట్రాఫిక్ దారి మళ్లింపు ..

శ్రీరామ శోభాయాత్రను పురస్కరించుకుని యాత్ర సాగే మార్గాలలో పోలీస్ అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు మల్లేపల్లి చౌరస్తా, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు బోయిగూడ కమాన్, గౌలిపుర చౌరస్తా, ఘోడే కి ఖబర్, సాయంత్రం 4 నుంచి 5 వరకు పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జ్, లేబర్ అడ్డా, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అలాస్కా టి జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్, సాయంత్రం 4 నుంచి 6 వరకు అఫ్జల్ గంజ్ జంక్షన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఇక సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు రంగమహల్ టీ జంక్షన్, పుత్లీబౌలి చౌరస్తా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ ఘాట్ చౌరస్తా. రాత్రి 7 నుంచి 9 వరకు కాచి గూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బొగ్గులకుంట చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేశారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

Next Story

Most Viewed