బహదూర్​పురాలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్​

by Disha Web Desk 11 |
బహదూర్​పురాలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్​
X

దిశ, చార్మినార్​ : బహదూర్​పురాలో సంచలనం సృష్టించిన ఓ యువకుడి హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న ఆరుగురిని బహదూర్​పురా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఐదుగురి నిందితులను రిమాండ్​ కు తరలించగా, మరో మైనర్​ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్​ హోంకు తరలించారు. పురాణిహవేలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సౌత్​జోన్​ డీసీపీ సాయిచైతన్య, ఫలక్​నుమా డివిజన్​ ఏసీపీ బి. యాదగిరి స్వామి తో పాటు బహదూర్​పురా ఇన్​స్పెక్టర్​ రఘునాథ్​ తో కలిసి వివరాలు వెల్లడించారు.

కిషన్​బాగ్​ అసద్​బాబానగర్​ కు చెందిన ​మొహమ్మద్​ ఖలీల్​ అలియాస్​ కన్న (23) వృత్తి రీత్యా డ్రైవర్​. అదే ప్రాంతానికి చెందిన కిషన్​ బాగ్​ అసద్​బాబానగర్​ కు చెందిన ఆటో డ్రైవర్​​ షేక్​ షబాజ్​ (22), చికెన్​ షాప్​లో పనిచేసే షేక్​ షహనావాజ్​ అలియాస్​ అద్దు (23), షోయబ్​ ఖాన్​ (30), ఏసీ టెక్నీషియన్​ మొహమ్మద్​ ఫారూఖ్​ (20), ఆటో డ్రైవర్​ సయ్యద్​ అక్బర్​ (29) లు మొహమ్మద్​ ఖలీల్​కు మంచి స్నేహితులు. ఈ నెల 15వ తేదీన రాత్రి ఎప్పటిలాగానే మొహమ్మద్​ ఖలీల్​తో పాటు మరో ఆరుగురు స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న మూసీ నది ఒడ్డున మద్యం సేవించారు. ఆరుగురిలో ఒకరైన మైనర్ యువకుడు షేక్​ షబాజ్​కు అత్యంత సన్నిహితుడు.

ఈ నేపథ్యంలోనే చిన్న విషయమై మొహమ్మద్​ ఖలీల్ కు​ సదరు మైనర్​ యువకునితో వివాదం తలెత్తింది. దీంతో ఖలీల్​ మైనర్​ యువకునిపై దుర్భాషలాడటం తో పాటు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఈ విషయంలో మైనర్​ యువకుడిపై దాడిచేసిన ఖలీల్​తో షబాజ్​​ గొడవకు దిగాడు. కాసేపటికే వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఫకీర్​ బస్తీలోని వాటర్​ ట్యాంక్​ ప్రాంతంలో ఖలీల్​ ఉన్నాడన్న సమాచారం మేరకు తిరిగి షేక్​ షబాజ్​ తో పాటు షేక్​ షహనవాజ్​, షోయబ్​ఖాన్, ఫారూఖ్​లు మైనర్​ యువకునితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అక్కడ పరస్పర దాడులు చేసుకుంటుండగా స్థానికులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఖలీల్ స్పృహ తప్పి కిందపోయాడన్న సమాచారం అందుకున్న అతని తండ్రితో పాటు సోదరుడు మొహమ్మద్​ ఖదీర్​లు అక్కడికి చేరుకున్నారు. ఇంతలోనే షబాజ్​ మాత్రం తనకు అవమానంగా భావించి అతని స్నేహితులతో కలిసి అక్బర్​ ఇంట్లో సమావేశమయ్యారు. ఎలాగైనా ఖలీల్​ను హత్యచేస్తామని కుట్రపన్నారు. వారంతా జామ్​జామ్​ హోటల్​ వద్దకు చేరుకున్నారు. ఖలీల్​పై దాడిచేయడానికి ప్రయత్నిస్తుండగా అడ్డగించిన అతన్ని సోదరుడిని అడ్డుకున్నారు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో ఖలీల్​పై విచక్షణ రహితంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

మృతుని సోదరుడు మొహమ్మద్​ ఖదీర్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బహదూర్​ పురా పోలీసులు కేసును నమోదు చేసుకున్న అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న షేక్​ షబాజ్​, షేక్​ షహనవాజ్​, షోయబ్​ ఖాన్​, మొహమ్మద్​ ఫారూఖ్​, సయ్యద్​ అక్బర్​లను అరెస్ట్​ చేసి గురువారం రిమాండ్​కు తరలించారు. మరో మైనర్​ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్​ హోంకు తరలించారు. ఈ కేసును బహదూర్​పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story