- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహానగరంలో శబ్ధ కాలుష్యం డేంజర్ బెల్స్..
దిశ ప్రతినిధి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో శబ్ద కాలుష్యం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను అధిక తీవ్రత కలిగిన శబ్దాలు వినికిడి సమస్యలకు కారణమవుతున్నాయి. సాధారణంగా మానవుని చెవికి 20 నుంచి 50 డెసిబెల్స్ మధ్య ఉండే ధ్వని ఆరోగ్యకరం కాగా నగరంలోని వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే ధ్వని తీవ్రత మాత్రం 75 నుంచి 90 డెసిబెల్స్ వరకు ఉంది, ఇవి ఒక్కోసారి 100 డెసిబెల్స్ను దాటి నమోదవుతోండడంతో నగరవాసుల చెవులు పగిలిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులు హారన్లు, సైలెన్సర్ల వినియోగంతో పలుచోట్ల పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదవుతోంది. ఫలితంగా ప్రజలు అనారోగ్య, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యల బారిన పడుతున్నారు. ఫ్యాన్సీ సైలెన్సర్లు, ప్రెషర్ హారన్లు, సిగ్నల్ వద్ద బండి వెళ్లడానికి అవకాశం లేకున్నా హారన్ కొట్టడం, రణగొణ ధ్వనులు, వేడుకలు, సభలు, సమావేశాల్లో భారీ లౌడ్ స్పీకర్లు వంటి వాటితో శబ్దకాలుష్యం జటిలమవుతోంది.
గ్రేటర్ పరిధిలోని 9 ప్రాంతాల్లో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేస్తుండగా అన్నిచోట్లా సగటున 10 డెసిబుల్స్ వరకు నమోదవుతోంది. నగర రోడ్లపై నిత్యం 50 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు, వేలాది పాత రవాణా వాహనాలు, కార్లు రోడ్లపై పరుగులు పెడుతున్న అధికారులు వీటిని నియంత్రించడం లేదు. ఇవి పెద్ద ఎత్తున వాయు, శబ్ద కాలుష్యం వెదజల్లుతున్నాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను అధికారులు నియంత్రించాల్సి ఉన్నా అధికారుల ఉదాసీనత నగర ప్రజల పాలిట శాపంగా మారుతోంది. శబ్ద కాలుష్యం కారణంగా మానసిక ప్రశాంతత లోపించి చిరాకు, ఆందోళనకు దారి తీస్తుందని, పరిమితికి మించి శబ్దాలు వచ్చే ప్రాంతంలో ఎక్కువ సేపు ఉంటే రక్తపోటు పెరుగుతుందని, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అవసరం లేకున్నా...?
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలు తమ వాహనాలకు తక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లు, హారన్లను బిగించుకోవాలి. వాహనాల ధ్వనులు 50 డెసిబెల్స్లోపు ఉండేలా తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు ఆధునీకరించిన వాహనాలు వినియోగంలోకి తెచ్చాయి. అయితే నగర యువత అవసరం లేకున్నా కంపెనీ నుంచి వచ్చిన వాహనాల హారన్లు, సైలెన్సర్లను తొలగించి 100కు మంచి డెసిబెల్స్ శబ్దం వచ్చేలా మార్పు చేసుకుని రయ్‌మంటూ రోడ్లపై వెళ్లే వారికి ఇబ్బందులు కల్గిస్తూ దూసుకుపోతున్నారు. దీంతో ట్రాఫిక్‌లో ఉండి బయటపడే సరికి వినికిడిలో తేడాలు వస్తున్నాయి. కొందరు తీవ్రమైన తలనొప్పి బారినపడుతున్నారు. అలాంటి వాహనాలను కట్టడి చేయడం, వారిని నియంత్రించ లేకపోవడంతో ధ్వని కాలుష్యానికి దారితీస్తోంది. అవగాహన లేని చాలా మంది వాహనచోదకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ శబ్ద కాలుష్యానికి కారకులవుతున్నారు.
ధ్వని తీవ్రతతో ఆరోగ్య సమస్యలు..
ధ్వని తీవ్రత మనిషి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అధిక ధ్వనిని వినడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి రక్తపోటు, నిద్రలేమి సమస్యలు వస్తాయి. నిస్సత్తువ పెరిగి మనిషి కుప్పకూలే ప్రమాదం ఉంది. పిల్లల మెదడు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. పగటి వేళ 50, రాత్రి వేళ 45 డెసిబెల్స్ దాటిన శబ్దాలను విన్న వారికి శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో శబ్దకాలుష్యం వల్ల ప్రతి వెయ్యిమందిలో సుమారు 25 శాతం మందికి పైగా వినికిడి శక్తి తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. అప్పుడే పుట్టిన శిశువులు 90 డెసిబెల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారు. మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. చురుకుదనం లోపించి బుద్ధిమాంధ్యం సంభవిస్తుంది.
నివారణ ఒక్కటే మార్గం..
వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే శబ్ధ కాలుష్యం నుంచి బయటపడే అవకాశం ఉంది. సిగ్నల్ పడిన దగ్గర, ట్రాఫిక్ జాం ఏర్పడిన సమయాలలో ఇంజన్లు ఆపివేయాలి. ముందుకు వెళ్లే అవకాశం లేకున్నా వెనుక ఉన్న వాహనదారులు అదే పనిగా హారన్లు మ్రోగించడంతో వినికిడి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అధిక ధ్వని వెలువడే బాణాసంచా కాల్చకపోవడం, సైలెన్సర్ మార్పిడితో పాటు చెడిపోయిన వాహనాలను రోడ్లపై తిప్పవద్దని వారు సూచిస్తున్నారు. నిబంధనల మేరకు వాహనాలకు హారన్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు నగర ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.