రాజీనామా చేస్తాననీ ప్రకటించా.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha News Web Desk |
రాజీనామా చేస్తాననీ ప్రకటించా.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: ఎల్బీన‌గ‌ర్‌ నియోజకవర్గ ప‌రిధిలోని వివిధ కాలనీలలో నెలకొన్న రిజిస్ట్రేషన్ల సమస్యకు త్వర‌లోనే శాశ్వత ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. అసైన్డ్ భూముల రిజ‌స్ట్రేష‌న్ స‌మ‌స్యల‌ను ఎదుర్కొంటున్న కాల‌నీ వాసుల‌తో గురువారం త‌న క్యాంపు కార్యాల‌యంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. దాదాపు రెండేళ్లుగా ఈ సమస్య ప‌రిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన తాను ఎన్నికల మేనిఫెస్టోలో పలు అంశాలను పేర్కొనడం జరిగిందని వివ‌రించారు. అనూహ్యంగ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టడంతో ఇచ్చిన హామీలను పరిష్కరించడానికి అధికారపక్షం ద్వారానే నెరవేర్చగలననే ఉద్దేశంతో అధికార పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారంలో వైఫల్యం చెందితే రాజీనామా చేస్తానని కూడా ప్రకటించడం జ‌రిగింద‌ని గుర్తు చేశారు.

ఈ క్రమంలో నియోజకవర్గంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ఎదురు చూస్తున్నటువంటి అన్ని కాలనీల సంక్షేమ సంఘాల కమిటీల సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక్కో కాలనీలో ఉన్నటువంటి ఒక్కో రకమైన సమస్యను రాతపూర్వకంగా కమిటీ సభ్యుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సమస్యలపై లోతైన అధ్యయనం చేసి పలు దఫాలుగా రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రిని, మంత్రులను కలవడంతో ఈ సమస్య పరిష్కారానికి ఒక కేబినెట్ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింద‌ని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదతరులందరికీ, అన్ని సంక్షేమ సంఘాల వారితో కలిసి ఈ సమస్యలపై వ్యక్తిగతంగా వినతి పత్రాలు సమర్పింద‌ని పేర్కొన్నారు. ఈ మేరకు భూ రిజిస్ట్రేషన్ల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రివర్గ ఉప సంఘ సభ్యులు సంబంధిత అంశాలను ఆమోదించాలని సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందన్నారు. ఈ మేరకు నాగోల్ డివిజన్ లో 13 కాలనీలు, మాన్సూరాబాద్ డివిజన్‌లో 11 కాలనీలు, హయత్ నగర్ డివిజన్ లో 6 కాలనీలు, చంపాపేట డివిజన్ లో10 కాలనీలు, బి.యన్.రెడ్డి. నగర్ డివిజన్ లోని 6 కాలనీలలోని దాదాపు 58 కాలనీలలో నెలకొన్న రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కానున్నదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు.

ఈ మేరకు తిరిగి మంత్రి వర్గ ఉప సంఘం త్వరలోనే సమావేశమై రిజిస్ట్రేషన్ల సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకుంటుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. కాల‌నీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ రిజిస్ట్రేషన్ల సమస్య సాకారమై అందరి ఆశలు అడియాశలు కాకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎంతో శ్రమకోర్చి దీనిని సాధించడానికి చేస్తున్న ప్రయత్నం హర్షణీయమ‌న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆనంతులబ‌రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్ గౌడ్, రఘుమారెడ్డి, శ్రీనివాస్ నాయక్ డివిజన్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, సత్యం చారి, జక్కిడి మాల్లారెడ్డి, చిరంజీవి, రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు అనిల్ చౌదరి, మాజీ డివిజన్ అధ్యక్షులు జగదీష్ యాదవ్, టంగుటూరి నాగరాజు, మల్లేష్‌, సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి, డేరంగుల కృష్ణ, రుద్ర.యాదగిరి నేత‌ డివిజన్ పరిధిలోని పలు విభాగాల కమిటీ సభ్యులు, మహిళలు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story