- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాట్రిక్ కష్టమే.. డిప్యూటీ స్పీకర్‌పై సికింద్రాబాద్‌లో వ్యతిరేకత
దిశ ప్రతినిధి, హైదరాబాద్/సికింద్రాబాద్ : తెలంగాణ ప్రజలు లష్కర్ అని ముద్దుగా పిలుచుకునే సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అధికార పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. ఈ నియోజకవర్గం నుంచి ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తూ వచ్చారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని ఆయన చూస్తున్నప్పటికీ ఇది అంత సులువుగా కనబడడం లేదు.
గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు సొంత పార్టీలోనే ఇతర నాయకులు టిక్కెట్లు ఆశిస్తుండడం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాగైనా ఈ పర్యాయం సికింద్రాబాద్ పై గెలుపు బావుటా ఎగురవేయాలని చూస్తుండడం ప్రతికూలంగా కనబడుతున్నాయి. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి గెలుపు పై ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి.
కీలకంగా మారనున్న మైనార్టీ ఓటర్లు..
ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్ నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలుగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. ఈ నియోజకవర్గంలో 2 లక్షల 64 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు 47 శాతంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. అడ్డగుట్టలో 54 వేల ఓట్లు, పార్శిగుట్టలో 28వేల ఓట్లు, మానికేశ్వరీ నగర్ (వడ్డెర బస్తీ)17 వేల మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ప్రస్థుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావుగౌడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్నారు. 2004లో మొదటి సారిగా సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి బరిలో నిలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై 56,997 ఓట్లతో ఘనవిజయం సాధించారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం 2014 నుంచి 2018 ఎన్నికల్లో లష్కర్ నుంచి వరుసగా గెలుపొందారు. మాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నా గతంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనబడుతోంది.
డబుల్ బెడ్ రూం ఇండ్లు ఏవి..?
2018 ఎన్నికలలో హామీల్లో భాగంగా పద్మారావు నియోజకవర్గంలోని పేదలకు 10 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చి పూర్తిస్థాయిలో నెరవేర్చలేక పోయారు. కేవలం 419 ఇళ్లను మాత్రమే అర్హులకు అందించారు. గతంలో సికింద్రాబాద్‌లోని బౌద్దనగర్‌లో ముఖ్యమంత్రి మూడుసార్లు పర్యటించారు. బౌద్దనగర్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతామని ప్రతీసారి హామీ ఇచ్చినా తర్వాత పట్టించుకోలేదు. సికింద్రాబాద్‌లో డిగ్రీ కళాశాల మంజూరు చేయించిన పద్మారావుగౌడ్ సొంత భవన నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాకపోవడంతో యువత సైతం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ కాలేజీని ప్రస్తుతం స్థానిక గవర్నమెంట్ స్కూల్‌లోనే నిర్వహిస్తున్నారు. అడ్డగుట్టలో 40 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం మంజూరు, సీతాఫల్‌మండీలో రైతు బజార్ ఏర్పాటు ముందుకు సాగలేదు. చిలకలగూడ నుంచి వారాహి గూడ రోడ్ వైడింగ్ పనులు పక్కన పెట్టేశారు.
2014 ఎన్నికల్లో ఇల్లు, బంగారం అమ్ముకుని పోటీ చేశానని పదేపదే చెప్పిన పద్మారావు గౌడ్ ఇప్పుడు కోట్లకు పడగలెత్తారని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. ఇవే కాకుండా స్థానికంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు చెక్కులు ఇప్పించి దాదాపు 10వేల మందికి ఆసరాగా నిలబడ్డారని, అది ఆయనకు కలిసి వస్తుందని పద్మారావు గౌడ్ అనుచరులు భావిస్తున్నప్పటికీ అవి ఆయనను గెలుపు తీరాలకు చేర్చేలా కనబడడం లేదనే సమాచారం. దీనికి తోడు బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా ఆ పార్టీ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
టిక్కెట్ ఆశిస్తున్న మరో నేత..
ఉప సభాపతి తీగుళ్ల పద్మారావుగౌడ్‌కు నియోజకవర్గంలోని సొంత పార్టీ నేత నుంచే తీవ్ర పోటీ నెలకొంది. మోతె శోభన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్టును ఆశిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండడం ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోంది. మరోవైపు పద్మారావుగౌడ్ కుమారుడు రామేశ్వర్ గౌడ్‌కు టిక్కెట్టు కోరుతున్నట్లు తెలిసింది. ఈ పర్యాయం గెలుపు అంత సులువు కాకపోవడంతో పద్మారావు గౌడ్ పోటీ నుంచి తప్పుకుని కుమారున్ని బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ విజయం అంత సులువు కాదనేది స్థానికంగా చర్చనీయాంశమైంది.