ఎలక్షన్ ఫీవర్.. ఎలక్షన్ డ్యూటీల్లో బల్దియా బిజీ

by Javid Pasha |
ఎలక్షన్ ఫీవర్.. ఎలక్షన్ డ్యూటీల్లో బల్దియా బిజీ
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీకి ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ఎపుడైనా వెలువడే అవకాశాలున్నాయంటూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను జీహెఎచ్ఎంసీ వేగవంతంగా చేసింది. ఇంటింటి సర్వేతో ఓటరు జాబితాను సవరించాల్సిన బాధ్యతలను ఇప్పటికే బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లతో పాటు ఇతర సిబ్బందికి అప్పగించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణకు విధించిన గడువు సమీపిస్తుండటంతో అధికారులు సైతం వన్ పాయింట్ ప్రొగ్రాంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు జీహెచ్ఎంసీ కూడా ఇదివరకే ప్రారంభించి వివిధ దశల్లో ఆగిన పెండింగ్ పనులపై దృష్టిసారించినట్లు సమాచారం.

వివిధ విభాగాలు రొటీన్‌గా నిర్వహించాల్సిన విధులను పక్కనబెట్టి ఎలక్షన్ డ్యూటీలకే పరిమితమయ్యాయి. మేయర్ విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్‌లో పర్యటించి వివిధ దశల్లో ఉన్న పనులను పరిశీలించి, విలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో రూ.10 కోట్ల 72 లక్షల అంచనావ్యయంతో చేపట్టిన మౌలిక సదుపాయాలు కల్పించే పనులను ఆమె సందర్శించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుత సిట్టింగ్‌లు, మాజీలు సైతం ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్దంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక టికెట్ కోసం ఇప్పటికే ఆశావహూలు తమ గాడ్‌ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు.

సవరణలో పారదర్శకత ఎంత?

ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ సిబ్బందికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా సవరణ జరగటం లేదన్న విమర్శలున్నాయి. సవరణ నిమిత్తం ఎలక్షన్ డ్యూటీలకు నియమితులైన బల్దియా సిబ్బంది స్థానికంగా ఉన్న అధికార పార్టీ, మరో పార్టీ నేతలను సంప్రదిస్తూ, ఇంటింటీ సర్వే నిర్వహించకుండానే వారు చెప్పిన విధంగా సవరణలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు ఎలక్షన్ స్టాఫ్‌కు పైస్థాయి అధికారుల ఒత్తిడి పెరగడంతో వారు ఏదోలా సవరణలు చేస్తూ మమ అనిపించేస్తున్నట్లు కూడా చర్చ జరుగుతుంది. ఒక్కో ఇంటి నెంబర్ పై పదుల సంఖ్యలో ఓట్లున్నట్లు, వాటిని తొలగించే విషయంపై అధికార పార్టీ నేతలు చెప్పినట్లు సిబ్బంది వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed