ఎవరేమైతే.. నాకేం?

by Mahesh |
ఎవరేమైతే.. నాకేం?
X

దిశ, సిటీబ్యూరో : ప్రజలు, ప్రజల ప్రాణాలను లెక్కచేయని కమిషనర్ జీహెచ్ఎంసీకి అవసరమా? అని మహా నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఏం జరుగుతుంది? క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల పనులెలా కొనసాగుతున్నాయన్నది ఆయనకు అవసరం లేదని, అంతెందుకు ఆయన జారీ చేసిన ఆదేశాలను తన కిందిస్థాయి సిబ్బంది అమలు చేయకున్నా, నాకేం అన్నట్టు వ్యవహారిస్తుంటారని పలువురు విమర్శిస్తున్నారు. దేశంలోనే అత్యున్నత ఐఏఎస్ హోదాలో ఉన్న ఆయన ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు, ఆయనకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేదా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

సందర్శన లేదు.. పరిశీలన లేదు..

మేయర్‌తో కలిసి నాలా విస్తరణ, స్ట్రాటెజికల్ నాలా డెవలప్‌మెంట్ (ఎస్ఎన్ డీపీ) పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశించి ఏడాది గడుస్తున్నా, ఆయన మేయర్‌తో కలిసి ఒక్క ప్రాజెక్టును గానీ, పనిని గానీ పరిశీలించలేదనే ఆరోపణలున్నాయి. పైగా మేయర్ అభివృద్ది, మెయింటనెన్స్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్తున్నట్లు సమాచారం వచ్చినా, ఆమె వెంట కూడా వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి.

2019 ఆగస్టు 27న లోకేశ్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. వచ్చిన కొత్తలో ఒకే ఒక్కసారి కోర్టు కేసులకు సంబంధించి లీగల్ సెక్షన్‌తో సమీక్ష నిర్వహించిన కమిషనర్ ఇప్పటి వరకు ఎలాంటి సమీక్షలు గానీ, క్షేత్రస్థాయి పర్యటనలు గానీ నిర్వహించకపోవడం ఆయన పనితీరుకు నిదర్శనమని మహానగర వాసులు మండిపడుతున్నారు.

ఆయన జీహెచ్‌ఎంసీకి రాకముందే ఎస్ఆర్‌డీపీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, సీఆర్ఎంపీ వంటి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కొనసాగుతుండగా, ఆయన వచ్చిన తర్వాత రూ.1800 కోట్ల వ్యయంతో 708 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణ కోసం సీఆర్ఎంపీ కార్యక్రమాన్ని ప్రారంభించిన, ఆయన కనీసం ఒక్కసారైనా పర్యటించలేదు, సమీక్షించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతెందుకు గత సంవత్సరం జూలైలో ఎల్బీనగర్ ప్రాంతంలో డైనేజీని శుభ్రపరిచేందుకు అందులోకి దిగి, ఇద్దరు కార్మికులు మృతి చెందినా, ఆయన కనీసం ఘటన స్థలాన్ని సందర్శించలేదు.

గత సంవత్సరం కూడా జూలైలో భారీ వర్షాలు కురిసి ఎన్నో ప్రాంతాలు నీట మునిగిన, ఇటీవల పది రోజుల పాటు కురిసిన వర్షాలకు నీట మునిగిని ఎల్బీనగర్ జోన్‌లోని అయ్యప్పనగర్ కాలనీ ప్రాంత వాసులు ఇండ్లు ఖాళీ చేసి వెళ్తున్నా, కనీసం ఆ ప్రాంతాన్ని కమిషనర్ సందర్శించలేదు. రాజకీయ నాయకులెలాగో ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వస్తుంటారు. కానీ నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించాల్సిన కమిషనర్ ఎందుకు ప్రజల్లోకి రావటం లేదని మహానగర వాసులు ప్రశ్నిస్తున్నారు.

ఆఫిస్‌లోను కలిసేందుకు ఇష్టపడరు..

సందర్శన వేళల్లో కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వారిని కనీసం కలిసేందుకు కూడా ఇష్టపడని కమిషనర్ వైఖరికి నిరసనగా ఆయన కారు ముందు నగర పౌరుడు ఒకరు బైఠాయించిన సందర్భాలు సైతం లేకపోలేవు. 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు వరద సాయం పేరిట బల్దియా నిధులు రూ.560 కోట్లను సంతర్పణ చేసిన ఘనత కూడా ఈ కమిషనరే వహించారు. త్వరలో నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న కమిషనర్ ఇప్పటికైనా ముంపు నివారణ పనులను పరిశీలిస్తారా? లేదా? వేచి చూడాలి.

కమిషనర్ సందర్శించి ఉంటే..

శనివారం ఉదయం దంచి కొట్టిన అకాల వర్షానికి నాలాలో పడి చిన్నారి కొట్టుకు పోయేందుకు పనులు జరుగుతున్న చోట ప్రమాద నివారణ చర్యలు గానీ, పనులు జరుగుతున్నట్టుగానీ బోర్డులు పెట్టకపోవడమే ప్రధాన కారణంగా తేలింది. ఈ క్రమంలో కమిషనర్ ఈ పనిని సందర్శించి ఉంటే ఇంజినీర్లు ప్రమాద నివారణ ప్రమాణాలతో పాటు పనులు జరుగుతున్నట్లు బోర్టులు, బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఉండే వారేమోనని, ఈ ప్రమాదం జరిగి చిన్నారి ప్రాణాలు కోల్పోయి ఉండకపోవచ్చునని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది.

ఇదేం వింత వైఖరి..

లోకేష్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తానే స్వయంగా నగరంలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీసుకు వెళ్లి పుష్పగుచ్చాలిచ్చి పలకరించి వచ్చారు. అంతేగాక, ఒకే రోజు ఒకే సమయానికి మేయర్, మంత్రి తలసాని కార్యక్రమాలున్నపుడు కమిషనర్ మంత్రి తలసాని కార్యక్రమానికి హాజరయ్యారైన సందర్భాలు సైతం ఉన్నాయి. కానీ అదే మంత్రి శనివారం కళాసీగూడలో నాలాలో పడి మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చినప్పుడు కమిషనర్ రాకపోవటం ప్రజల ప్రాణాలంటే లెక్కేలేదన్న అర్థమంటూ పలువురు విమర్శించారు.

మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్, గ్రోత్ కారిడార్ ఆఫీసులకు పిలిచి జీహెచ్ఎంసీపై సమీక్షలు నిర్వహిస్తుంటారు. ఇప్పటి వరకు పలుసార్లు సమీక్షలు నిర్వహించిన కేటీఆర్ రెండేళ్ల క్రితమే ఎస్ఎన్‌డీపీ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చినప్పుడు మేయర్‌తో కలిసి నాలాల పనులను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని చెప్పినా, మంత్రి ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story