- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఇద్దరిలో ఎవరూ గెలిచిన తెలంగాణలో మరో బై ఎలక్షన్.. ఆసక్తిగా మారిన ఎమ్మెల్యేల పోటీ..!
దిశ, హైదరాబాద్ బ్యూరో: సికింద్రాబాద్ నుంచి గెలిచి పార్లమెంట్‌లో మరోమారు అడుగుపెట్టేందుకు బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు ఎంపీగా కొనసాగున్నారు. ఇక్కడి నుంచి కిషన్‌రెడ్డి తిరిగి గెలిస్తే ఎలాంటి ఉప ఎన్నిక అవసరం ఉండదు. అలా కాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా ఉప ఎన్నిక అనివార్యం. మొత్తం మీద ఇక్కడి పోరు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మధ్య అన్నట్లుగా మారింది.
త్రిముఖ పోటీ..
సికింద్రాబాద్ ఎంపీ సీటు కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అందరూ లష్కర్ అని ముద్దుగా పిలుచుకునే ఈ పార్లమెంట్ స్థానంలో గెలుపెవరిది..? అనేది ఆసక్తిగా మారింది. ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీలకు చెందిన హేమాహేమీలు బరిలో ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పార్టీ ప్రభావం కోల్పోయింది. దీంతో పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రెండు టర్మ్‌లు అధికారాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ నుంచి ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు. దీంతో ఇప్పుడా పార్టీ పరిస్థితి ఏమిటీ..? 2014, 2019 ఎన్నికలలో గెలుపును సొంతం చేసుకున్న బీజేపీ మరోమారు గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా..? అనేది చర్చనీయాంశం అయింది.
సికింద్రాబాద్ లోక్ సభ స్థానాన్ని అత్యధికసార్లు గెలిచిన పార్టీ కాంగ్రెస్ కాగా తెలంగాణలో బీజేపీ ఎక్కువసార్లు గెలిచిన లోక్ సభ నియోజకవర్గం కూడా ఇదే కావడం గమనార్హం. ఈ నియోజకవర్గం పరిధిలోకి ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాలు వస్తాయి. ఇది పూర్తిగా పట్టణ జనాభాతో కూడిన నియోజకవర్గం కాగా వీటన్నంటిలో ఒక్క నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాలు మినహాయిస్తే అన్నింటిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నా విజయం మాత్రం దక్కడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి పిరాయించి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు.
మాటల యుద్ధం..
పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా చాలా రోజుల గడువు మిగిలి ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగా బీఆర్ఎస్‌లో మాత్రం సొంత పార్టీ నాయకుల మధ్య సఖ్యత లోపించింది. మంగళవారం జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మరో నేత రావుల శ్రీధర్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది. సన్నాహక సమావేశం స్టేజీపైనే అందరూ చూస్తుండగానే తిట్టుకున్నారు. నిన్ను ఎవడ్రా పిలిచింది అని మాగంటి అంటే.. నిన్నెవడ్రా పిలిచింది, నువ్వెవడివి నాకు చెప్పేదంటూ శ్రీధర్‌రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ ఇద్దరు నేతల మధ్య గత కొంత కాలంగా సఖ్యత లేకపోయినప్పటికీ పార్టీ అధిష్టానం వారి మధ్య సయోద్య కుదిర్చే ప్రయత్నం చేయడం లేదని, దీంతో పార్టీ నష్టపోయే ప్రమాదముందని కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్‌పై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సందించింది. దానం కాదు దాహం నాగేందర్ అంటూ ట్వీట్ చేసింది. దానం భూ కబ్జాలు చేశారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రకాష్‌నగర్ బస్తీవాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికార పార్టీ పట్టించుకోకపోవడమే కాకుండా ఎంపీ టికెట్ ఖరారు చేసిందంటూ విమర్శలు గుప్పించింది. ఇంకా నామినేషన్ల పర్వం కూడా మొదలు కాకుండానే ప్రధాన పార్టీ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ మూడు పార్టీలు డైలాగ్ వార్‌కు తెరతీశాయి.
బోణీ కొట్టని బీఆర్ఎస్..
సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. ఈ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో పోటీ చేసినా బీఆర్ఎస్ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం పార్లమెంట్‌కు మూడవ పర్యాయం జరుగనున్న ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అంతగా అనుకూలంగా కనబడడం లేదు. 2019 ఎన్నికల సమయంలో సనత్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్ పార్టీ నుంచి పోటీ చేసిన తన కుమారుడిని గెలిపించుకోలేకపోవడంతో ఈ పర్యాయం పార్టీ అభ్యర్థిని మార్చి పద్మారావుగౌడ్ వైపు మొగ్గు చూపింది. మొత్తం మీద త్వరలో సికింద్రాబాద్ నియోజకవర్గానికి జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలు మూడు పార్టీ మధ్య త్రిముఖ పోటీగా మారింది.