హ‌న్మకొండ‌లో గండ్ర స‌త్యానారాయ‌ణ హౌస్ అరెస్ట్‌

by GSrikanth |
హ‌న్మకొండ‌లో గండ్ర స‌త్యానారాయ‌ణ హౌస్ అరెస్ట్‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: భూపాల‌ప‌ల్లి జిల్లా రాజ‌కీయ సెగ హ‌న్మకొండ‌కు తాకింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర ర‌మ‌ణారెడ్డి, కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి గండ్ర స‌త్యానారాయ‌ణ‌లు పోటాపోటీగా స‌వాళ్లు విసురుకున్న విష‌యం తెలిసిందే. తాను ఎలాంటి అక్రమాలు, భూ ఆక్రమ‌ణల‌కు పాల్పడ‌లేదని, తాను అక్రమాల‌కు, భూ దందాల‌కు పాల్పడిన‌ట్లుగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ద‌మ్ముంటే నిరూపించాల‌ని రెండు రోజుల క్రితం స‌వాల్ విసిరారు. ఎమ్మెల్యే గండ్ర ర‌మ‌ణారెడ్డి అక్రమాలు, క‌బ్జాల‌ను ఆధారాల‌తో స‌హా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, గురువారం భూపాల‌ప‌ల్లి అంబేద్కర్ సెంట‌ర్‌లో చ‌ర్చకు రావాలంటూ ప్రతి స‌వాల్ విసిరారు.

దీంతో భూపాల‌ప‌ల్లి రాజ‌కీయాల్లో హై టెన్షన్ క్రియేటయింది. వ‌రుస‌గా మూడు రోజులుగా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్షణ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంటోంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత‌లు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల‌ను క‌ట్టనీయ‌కుండా బీఆర్ఎస్ నేత‌లు అడ్డుకోవ‌డంతో తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అదేరోజు సాయంత్రం పబ్లిక్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండ‌గా కాంగ్రెస్‌ నేత‌ల‌పై, రేవంత్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, కొడిగుడ్లతో దాడి జ‌రిగింది. ఇదంతా కూడా గండ్ర ర‌మ‌ణారెడ్డి అనుచ‌రులే చేస్తున్నార‌ని, ఎమ్మెల్యే ప‌థ‌కం ప్రకారం వ‌రుస దాడుల‌కు ఉసిగొల్పుతున్నార‌న్న వాద‌నను కాంగ్రెస్ నాయ‌కులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే గండ్ర, కాంగ్రెస్ నేత స‌త్యనారాయ‌ణ ప్రతి స‌వాళ్లు విస‌రుకోవ‌డం, గురువారం భూపాల‌ప‌ల్లి అంబేద్కర్ సెంట‌ర్‌లో వేదిక‌గా కూడా నిర్ణయించుకోవ‌డంతో పోలీసు శాఖ అప్రమ‌త్తమైంది. జిల్లాలో వారం రోజుల పాటు 144 సెక్షన్‌ను అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. అలాగే హ‌న్మకొండ‌లో నివాస‌ముంటున్న కాంగ్రెస్ నేత‌ గండ్ర స‌త్యనారాయ‌ణ‌ను గురువారం తెల్లవారుజామునే హౌస్ అరెస్ట్ చేశారు. స‌త్యానారాయ‌ణ ఇంటి ఎదుట భారీ సంఖ్యలో పోలీసుల‌ను మొహ‌రించారు. అయితే లోనికి వెళ్లిన మీడియాతో గండ్ర స‌త్యానారాయ‌ణ మాట్లాడారు. ఇప్పటికీ త‌న స‌వాల్‌కు క‌ట్టుబ‌డి ఉన్నట్లుగా ఎమ్మెల్యేను ఉద్దేశించి పేర్కొన్నారు.

గండ్ర ర‌మ‌ణారెడ్డి పేద‌ల భూముల‌ను అక్రమంగా క‌బ్జా చేసింది నిజం కాదా..? ధ‌ర‌ణి పేరుతో జ‌రిగిన కుట్రలో పేద‌ల భూముల‌ను కొనుగోళ్ల మాటున చేజిక్కించుకున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. పోలీసుల చేత భూపాల‌ప‌ల్లి ప‌ట్టణంలో నిర్భంద చ‌ర్యల‌కు పాల్పడుతున్నార‌ని అన్నారు. ప్రజ‌లంతా ర‌మ‌ణారెడ్డి దౌర్జన్యాల‌ను, కుట్రల‌ను గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో నెల‌కొన్న తాజా ఘ‌ట‌న‌ల‌తో జిల్లా అంత‌టా కూడా ఉద్రిక్తత ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇది ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తోంద‌న్న టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Advertisement

Next Story

Most Viewed