బండి సంజయ్ అరెస్టులో హై టెన్షన్..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-05 09:13:54.0  )
బండి సంజయ్ అరెస్టులో హై టెన్షన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : పదో తరగతి పరీక్షల హిందీ ప్రశ్నాపత్రం మంగళవారం లీకైన వ్యవహారంలో బండి సంజయ్‌ను నిందితుడిగా పేర్కొన్న పోలీసులు కరీంనగర్‌లోని ఆయన నివాసం నుంచి అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేశారు. అనంతరం ఆయనను యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. కమలాపూర్ పోలీసులు ఆయనపై ఐపీసీలోని 420, ఐటీ యాక్టులోని 66-డీ, తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ మాల్ ప్రాక్టసు ప్రివెన్షన్ చట్టంలోని సెక్షన్ 4(ఏ), 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

వీటికి తోడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 154, 157 ప్రకారం కూడా కేసులు నమోదయ్యాయి. ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రభుత్వ ఉద్యోగి శివప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత కోర్టులో హాజరు పర్చడానికి రూపొందించిన రిమాండ్ రిపోర్టులో సెక్షన్ 120ని కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టు సమయంలో నిరసనలు

కరీంనగర్ నివాసంలో బండి సంజయ్‌ను అరెస్టు చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు భారీ స్థాయిలో నిరసన తెలిపారు. వాగ్వాదం చోటుచేసుకున్నది. ఆ తర్వాత బుధవారం, ఉదయం ఆయనను బొమ్మల రామారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అరెస్టు చేశారు.

నాంపల్లిలోని పార్టీ ఆఫీసుకు వెళ్లడానిక సిద్ధమైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను రోడ్డు మీదనే హకీంపేట దగ్గర అరెస్టు చేశారు. ఆ పార్టీకి చెందిన మాజీ నేత ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా బొమ్మలరామారం పీఎస్ దగ్గర పోలీసులు అరెస్టుచేశారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సైతం బండి సంజయ్‌తో పాటు పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. ఫార్మాలిటీస్‌ను పూర్తిచేసిన పోలీసులు ఆయనను భువనగిరి జిల్లా జడ్జి నివాసంలో హాజరుపర్చడానికి వెళ్ళిన సమయంలో ఇద్దరు న్యాయమూర్తులు సెలవులో ఉన్నారని తెలుసుకుని వరంగల్ తరలించే ప్రయత్నం చేశారు.

పాలకుర్తి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు

కోర్టులో హాజరుపర్చడానికి ముందు ఆయనకు పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. బండి సంజయ్ అరెస్టు వార్త తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు బొమ్మలరామారం సహా పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఆయనను పటిష్ట పోలీసు భద్రత నడుమ పోలీసు వాహనాల్లో వరంగల్‌కు తరలిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఒక్కో పోలీసు స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు పోలీసులు తరలిస్తూ ఉండడంతో బీజేపీ లీగల్ సెల్ తరఫున భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్.. తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

ఆయనను అరెస్టు చేయడానికి నిర్దిష్ట కారణాలేవీ చూపలేదని, అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేస్తున్నప్పుడు పోలీసులు నిర్దిష్ట నిబంధనలను పాటించలేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు మాత్రలు వేసుకోడానికి కూడా పోలీసులు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు లీగల్ సెల్ ప్రయత్నాలు చేస్తున్నది.

బీజేపీ హై కమాండ్ సీరియస్

బండి సంజయ్ అరెస్టు వ్యవహారాన్ని బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్నది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అక్కడే ప్రధాని మోడీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, లీగల్‌గా ఎదుర్కోవాల్సిన మార్గాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఈ నెల 8న ప్రధాని టూర్ ఉన్న సమయంలో సంజయ్ అరెస్టు చోటుచేసుకోవడం సీరియస్ వ్యవహారంగా మారింది.

ప్రధానితో జరిగిన సమావేశం అనంతరం అమిత్ షా, జేపీ నడ్డా విడిగా చర్చించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ నాయకుడైన మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు జేపీ నడ్డా ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసి తాజా స్థితిగతులను అడిగి తెలుసుకుని తదుపరి కార్యక్రమాలపై సూచనలు చేశారు.

రాష్ట్ర నేతల అత్యవసర భేటీ

మరోవైపు కేంద్ర అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి బండి సంజయ్ అరెస్టుకు సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు. ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో, ఎందుకు అరెస్టు చేశారో కూడా డీజీపీ తెలియడంలేదని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. కేంద్ర అధిష్టానం నుంచి పలు సూచనలు రాష్ట్ర నేతలకు అందాయి. తెలంగాణ పార్టీ నేతలంతా అత్యవసర సమావేశం నిర్వహించి యాక్షన్ ప్లాన్ గురించి చర్చించుకోవాలని పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు అందాయి.

కుట్రపూరితంగానే బండి సంజయ్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారని, దీన్ని రాజకీయంగా ఎదుర్కోడానికి తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ సైతం దీనిపై స్పందించి పేపర్ల లీకేజీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.

పేపర్ల లీకేజీకి పొలిటికల్ కలర్

బండి సంజయ్ అరెస్టుతో రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయ అంశంగా మారింది. పేపర్ల లీక్, దాని వెన్నంటి ఉన్న ప్రభుత్వ వైఫల్యం పక్కకు పోయి బండి సంజయ్ అరెస్టు కీలకంగా మారింది. వరంగల్ జిల్లా కమలాపూర్‌లో టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం మంగళవారం లీకైన కొన్ని గంటల్లోనే నగర పోలీసు కమిషనర్ రంగనాథ్ ప్రెస్ మీట్‌లో బండి సంజయ్ పేరును ప్రస్తావించడంతోనే మరికొన్ని గంటల వ్యవధిలో ఏదో జరగబోతుందన్న ఊహాగానాలు వినిపించాయి. అర్ధరాత్రి అరెస్టుతో ఈ అనుమానాలు నిజమయ్యాయని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.

హిందీ పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రమేయం ఉన్నట్లు సీపీ రంగనాధ్ కామెంట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ నేతలంతా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి బండి సంజయ్ ప్రయత్నించారని ఆరోపించారు. పదుల సంఖ్యలో మంత్రులు, బీఆర్ఎస్ నేతలు వరుస ప్రెస్‌మీట్‌లు పెట్టి బండి సంజయ్‌ను నిందితుడిగా దోషిగా చూపెట్టారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం మరికొద్ది సేపట్లో వివరాలను అందించనున్నారు.

Read more:

గవర్నర్‌ను కలవనున్న బీజేపీ నేతలు.. డిమాండ్ ఇదే!

Advertisement

Next Story