ఏపీ అంటే అతనే! రూ.15 కోట్లు ముట్టింది ఎమ్మెల్సీ కవితకేనా?

by Sathputhe Rajesh |
ఏపీ అంటే అతనే! రూ.15 కోట్లు ముట్టింది ఎమ్మెల్సీ కవితకేనా?
X

2020లోనే ఆమ్​ ఆద్మీ పార్టీ నుంచి రూ.15 కోట్లు ఓ టీఆర్‌ఎస్​(ఇప్పుడు బీఆర్ఎస్) ఎమ్మెల్సీ అందున్నారని..ఆ నేత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్​స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్నారని సుకేశ్​చంద్రశేఖర్​ఇచ్చిన హింట్​తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. నేరుగా పేరు చెప్పనప్పటికీ సౌత్​ గ్రూప్‌లోని బీఆర్‌ఎస్​లీడర్​అంటూ ఇచ్చిన హింట్లు అన్నీ ఎమ్మెల్సీ కవితకే పోలుతున్నాయి. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్​పార్టీ ఆఫీసు ఆవరణలో 6060 అనే నంబర్​ఉన్న రేంజ్​రోవర్​కారులో ఏపీ అనే వ్యక్తికి ఆ డబ్బు అందిందని పేర్కొంటూ..అతడే అరుణ్​పిళ్లయ్​అని చంద్రశేఖర్​స్పష్టత ఇవ్వడం గమనార్హం. దీంతో ఢిల్లీ లిక్కర్​ కేసుకు ముందు నుంచే బీఆర్ఎస్, ఆప్​మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రూ.15 కోట్లను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవితకు చేరేలా ఆమె ప్రతినిధిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్‌కు 2020లోనే అందించినట్టు గురువారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో సంచలన ఆరోపణలు చేశాడు. కవితను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇచ్చిన హింట్‌లలో నాల్గింటిని ఆయన ఉదహరించాడు.

రూ.15 కోట్లు అందుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్‌ ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. సదరు వ్యక్తి లిక్కర్ స్కామ్‌లో ‘సౌత్ గ్రూపు’లో ఉన్నట్లు వెల్లడించాడు. ఆమె ‘అసోసియేట్’ అయిన ఏపీ (అరుణ్ పిళ్లయ్)కు ఈ డబ్బు ముట్టిందన్నారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఆఫీసు ఆవరణలో పార్కింగ్ చేసి ఉంచిన నలుపు రంగు రేంజ్ రోవర్ కారు (నం.6060)కు ముందు వైపు అద్దానికి (విండ్ షీల్డ్) ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్నదని వివరించాడు. ఈ నాలుగు రకాల హింట్‌లు పరోక్షంగా ఎమ్మెల్సీ కవిత అని నిర్ధారించినట్లయింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ముందు నుంచే ?

ఢిల్లీ లిక్కర్ స్కాం గతేడాది సెప్టెంబర్‌లో వెలుగులోకి వచ్చింది. కానీ సుఖేశ్ చంద్రశేఖర్ మాత్రం రూ.15 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీకి 2020లోనే ఇచ్చినట్లు గత వారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నాడు. లిక్కర్ స్కామ్ ప్రారంభం కావడానికి దాదాపు ఏడాదికి ముందే రెండు పార్టీల మధ్య సంబంధాలున్నట్లు ఈ ప్రెస్‌నోట్‌తో స్పష్టమవుతున్నది.

ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ పేర్లను ప్రస్తావించిన సుఖేశ్.. బీఆర్ఎస్ పార్టీ తరఫున డబ్బులు అందుకున్న వ్యక్తి పేరు మాత్రం నేరుగా ప్రస్తావించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగానూ, సౌత్ గ్రూపులో ఉన్న వ్యక్తిగానూ, ఎమ్మెల్సీ స్టిక్కర్ కారు కలిగిన వ్యక్తిగానూ, అరుణ్ పిళ్లయ్‌ను అసోసియేట్ పెట్టుకున్న లీడర్‌గానూ కొన్న ముక్తాంపులను ఇవ్వడం గమనార్హం.

తగిన ఆధారాలతోనే ఆరోపణలు

సుఖేశ్ ఇచ్చిన ఈ హింట్‌లన్నింటినీ పరిశీలిస్తే.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనే అభిప్రాయం కలుగుతున్నది. మొదటి సారి రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్‌లో ఏపీ, ఘీ అంటూ కోడ్ పదాలు వాడి ఆ రెండింటికీ రెండో ప్రెస్‌నోట్‌లో డీకోడింగ్ అర్థాలు చెప్పాడు. ఏపీ అంటే అరుణ్ పిళ్లయ్ అనీ, ఘీ (నెయ్యి) అంటే రూ.కోటి అని వివరించాడు.

రెండో ప్రెస్‌నోట్‌ తర్వాత విడుదల చేయాలనుకుంటున్న వాట్సాప్ చాటింగ్ స్ట్రీన్ షాట్‌ను స్టార్టర్, టీజర్ మాత్రమే అని సస్పెన్స్‌లో పెట్టాడు. రానున్న కాలంలో సుఖేశ్.. బీఆర్ఎస్ నేత పేరును బహిర్గతం చేస్తారా ? లేక స్క్రీన్ షాట్ చూడగానే అర్థమవుతుందా ? అనేది స్పష్టం కావాల్సి ఉన్నది. తగిన ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేస్తున్నట్లు సుఖేశ్ నొక్కిచెప్పడం గమనార్హం.

స్క్రీన్ షాట్‌తో మరింత క్లారిటీ

రెండు పేజీల ప్రెస్‌నోట్‌తో పాటు స్క్రీన్ షాట్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు సుఖేశ్ చంద్రశేఖర్ చెప్పినా కొన్ని లీగల్ కారణాలతో సాధ్యం కాలేదని, ఈ నెల 11న మీడియాకు అందించనున్నట్లు లాయర్ ఆఫీసు వర్గాలు పేర్కొన్నాయి. తాజా ప్రెస్‌నోట్‌లో పేర్కొన్న ఆరోపణలను ఈ స్క్రీన్‌షాట్ రూఢీ చేస్తుందని సుఖేశ్ పేర్కొన్నాడు.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, మంత్రి సత్యేంద్రజైన్ ఆదేశాల మేరకే ఈ డబ్బును హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఆఫీస్ ఆవరణలో అరుణ్ పిళ్లయ్‌కు అందజేసినట్లు తెలిపాడు. డబ్బు అందుకున్న తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి రిప్లై కూడా వెళ్లిందని, దీన్ని తాము టోకెన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని వ్యవహరిస్తున్నట్లు తెలిపాడు. స్క్రీన్ షాట్‌లో రెండు పార్టీల మధ్య ఈ డబ్బు బదిలీపై స్పష్టత వస్తుందని సుఖేశ్ వివరించాడు. కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ ఆదేశాల మేరకు హవాలా మార్గంలో ఈ డబ్బు బదిలీ అయినట్లు వివరణ ఇచ్చాడు.

703 స్క్రీన్ షాట్‌లలో ఇది మొదటిది

వాట్సాప్ చాటింగ్‌లకు సంబంధించి తన దగ్గర ఉన్న మొత్తం 703 స్క్రీన్ షాట్‌లలో ఇది మొదటిదని, బీఆర్ఎస్‌కు చెందిన సీనియర్ లీడర్‌కు, తనకు మధ్య జరిగిన ఈ చాటింగ్ మరింత క్లారిటీ ఇస్తుందని సుఖేశ్ పేర్కొన్నాడు. ఇది ఇకపైన రిలీజ్ చేయబోయే చాటింగ్‌లలో స్టార్టర్ మాత్రమేనని కామెంట్ చేశాడు.

గతవారం రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్‌లో 15 కిలోల నెయ్యి, ఏపీ అని కోడ్ భాషలో రాసుకున్న వివరాలను తాజా ప్రెస్‌నోట్‌లో డీకోడ్ చేసి వివరించాడు. అరుణ్ పిళ్లై అనే వ్యక్తి డబ్బులు అందుకుంటున్న బీఆర్ఎస్ నేతకు అసోసియేట్ అని సుఖేశ్ పేర్కొన్నాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ, ఈడీ అధికారులు సైతం అరుణ్ పిళ్లయ్‌ను, ఎమ్మెల్సీ కవితకు రిప్రెజెంటేటివ్, అసోసియేట్ అని వ్యాఖ్యానిస్తున్నారు.

సౌత్ గ్రూపు వ్యక్తికి చేరిన డబ్బు

బీఆర్ఎస్ తరఫున ఈ డబ్బు అందుకుంటున్న నేత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్నారని, సౌత్ గ్రూపులో ఒకరిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అరుణ్ పిళ్లయ్‌కు రూ.15 కోట్లు ఇస్తున్న సందర్భంగా నలుపు రంగు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారులో అప్పటికే కరెన్సీ కట్టలున్న పెట్టెలున్నాయని తెలిపారు.

స్క్రీన్ షాట్ రిలీజ్ చేసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో స్పష్టత వస్తుందని తెలిపాడు. ఈ రెండు పార్టీలూ భుజం భుజం కలిపి ఎలా వ్యవహరిస్తున్నాయో..వాటి మధ్య ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయో, వ్యాపార సంబంధాలు ఎలా ఉన్నాయో, వ్యక్తులుగా వారి మధ్య ఎలాంటి సంప్రదింపులు జరిగాయో..ఇవన్నీ స్క్రీన్ షాట్‌ విడుదల చేసిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని సుఖేశ్ పేర్కొన్నాడు.

ఒక స్టార్టర్ మాత్రమే

తాను విడుదల చేయబోతున్న స్క్రీన్ షాట్ ఒక స్టార్టర్ మాత్రమేనని, ఆ తర్వాత వచ్చేవి బ్లాక్ బస్టర్ తరహాలో ఉంటాయని సుఖేశ్ పేర్కొన్నాడు. కేజ్రీవాల్ సహా ఆయన సన్నిహితులు కూడా ఈ టీజర్ కోసం సిద్ధంగా ఉండాలని సెటైర్ వేశాడు. ఇప్పుడు తనపైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ చూపించలేకపోయారని కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. కానీ తన దగ్గర మాత్రం ఇప్పుడు లేవనెత్తుతున్న అన్ని ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని సుఖేశ్ స్పష్టం చేశాడు. మొత్తం 703 స్క్రీన్ షాట్‌లు తన దగ్గర ఉన్నాయని, అందులో ఇది మొదటిది మాత్రమేనని, ఇకపైన అసలు కథ ముందు ఉంటుందంటూ కేజ్రీవాల్‌కు వార్నింగ్ ఇచ్చారు.

నార్కో, పాలీగ్రాఫ్ టెస్టులకు సిద్ధంగా ఉన్నా

ప్రెస్‌నోట్‌ల ద్వారా వాస్తవాలను వెల్లడిస్తున్న తనపై కేజ్రీవాల్ సహా చాలా మంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని సుఖేశ్ ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తూనే అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్న వీరు ఇక జరగబోయే పరిణామాలకు కాచుకుని ఉండాలని హెచ్చరించాడు. ‘నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. వాస్తవమైన అంశం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను నార్కో అనాలసిస్ టెస్టుకు, పాలీగ్రాఫ్ పరీక్షకు లేదా ఇతర ఏ టెస్టులకైనా సిద్ధంగా ఉన్నాను. మీరూ వాటికి సిద్ధంగా ఉండండి. ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటుంది” అని ప్రెస్‌నోట్‌లో సవాలు విసిరాడు.

పక్కా ఆధారాలున్నాయి..

ప్రస్తుతం తాను లేవనెత్తుతున్న అంశాలన్నింటికీ తన దగ్గర పక్కా ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయని, ప్రతి స్టేట్‌మెంట్‌కూ కట్టుబడి ఉన్నానని సుఖేశ్ వ్యాఖ్యానించాడు. మొత్తం వాట్సాప్ చాటింగ్ స్క్రీన్‌షాట్‌లలో 2015 నుంచి 2023 వరకు సంబంధించినవి ఉన్నాయన్నాడు. కేజ్రీవాల్, సత్యేంద్రజైన్, ఇతరులకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ బహిర్గతం చేయడానికి ఎంతకైనా తెగిస్తానని స్పష్టం చేశాడు. ‘ఆమ్ ఆద్మీ పార్టీకో హఠావో.. కేజ్రీవాల్‌ కో భగావో.. కేజ్రీవాల్ కీ ఖట్టర్ కరప్షన్ ఔర్ డ్రామా సే బచావో’ అంటూ సుఖేశ్ ప్రెస్‌నోట్ ముగింపులో వార్నింగ్ ఇచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed