Good News: నిరుపేదలకు భారీ గుడ్ న్యూస్.. 28 వేల ఇందిరమ్మ ఇండ్లు!

by Shiva |
Good News: నిరుపేదలకు భారీ గుడ్ న్యూస్.. 28 వేల ఇందిరమ్మ ఇండ్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వరదలు..పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకు 28 వేల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. వీటిలో దాదాపు 11,500 ఇండ్ల వరకు పూర్తిగా దెబ్బతిని నేలమట్టం అయ్యాయని అంచనాకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా జిల్లాల కలెక్టర్లు నివేదిక అందజేశారు. ఇండ్లు పూర్తిగా ధ్వంసమైన బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హౌసింగ్ ఆఫీసర్లు గ్రామాల వారీగా ఇండ్లు కూలిన వాటి సమాచారం తెప్పించుకున్నారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది.

పూర్తిగానా.. పాక్షిక ధ్వంసమా?

వర్షాలు, వరదల కారణంగా ఇండ్లు కూలిన వారిలో ఎవరికి ఇండ్లు ఇస్తారన్న దానిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఈ విషయమై హౌసింగ్ అధికారులను సంప్రదిస్తే.. సర్కారు నిర్ణయం తీసుకుంటే కానీ చెప్పలేమని అంటున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం చూస్తే..పూర్తిగా ధ్వంసమైతే మాత్రమే ప్రభుత్వం ఇండ్ల స్కీం కింద ఇస్తుందని, పాక్షికంగా దెబ్బతిన్న వారికి కేవలం కొంతమేర ఆర్థిక సాయం చేస్తారని వెల్లడిస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లకు ఆయా బాధితులకు మాత్రం ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ మొదటి విడతలోనే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఆఫీసర్లు వివరిస్తున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ మరిన్ని రోజులు జరగనున్న నేపథ్యంలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

3 రకాలుగా ఇండ్ల ధ్వంసం గణాంకాలు

వర్షం, వరదలకు కూలిన ఇండ్లపై ఆఫీసర్లు మూడు రకాలుగా సమాచారం హౌసింగ్ అధికారులు, రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్నారు. పూర్తిగా కూలిపోయిన ఇండ్లు ఒక కేటగిరీ కింద, పాక్షికంగా ధ్వంసమైన ఇండ్లు మరో కేటగిరీ కింద.. అందులోనూ వాగులు, చెరువుల వెంట ఉన్న ఇండ్ల వివరాలను ఇంకో కేటగిరీ కింద సేకరించి సర్కారుకు నివేదించారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఇంటి స్థలం ఉన్నోళ్లకు రూ.5 లక్షలు, ఇంటి జాగ లేనోళ్లకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెరువులు, వాగుల వెంట ఉన్న ఇండ్లు కూలిపోయినోళ్లకు.. తిరిగి అదే స్థలంలో కాకుండా ప్రత్యామ్నాయంగా ఇతర ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు.

అయితే, మొన్న ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోనే వర్షాలు ఎక్కువగా కురవడంతో బాధితులు కూడా అక్కడి నుంచే ఎక్కువగా ఉన్నారు. దెబ్బతిన్న 28 వేల ఇండ్లలో ఎక్కువ శాతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో మహబుబాబాద్ జిల్లా ఉందని ఆఫీసర్లు వెల్లడిస్తున్నారు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్.. ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. బాధితులందరికీ స్కీమ్ తొలి దశలోనే ఇండ్లు ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.

Advertisement

Next Story

Most Viewed