ANM: కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెల 29న యథావిధిగా రాత పరీక్ష

by Ramesh N |
ANM: కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెల 29న యథావిధిగా రాత పరీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల (Contract ANM) ఉద్యోగాలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ (Damodar Rajanarsimha) భరోసానిచ్చారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చినప్పటికీ, కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను ఉద్యోగం నుంచి తీసేయబోమన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో తనను కలిసిన ఏఎన్‌ఎంలతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. వారి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు కోరగా, ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌ అంశం కోర్టు పరిధిలో ఉందని మంత్రి వివరించారు.

ఏఎన్‌ఎం రెగ్యులర్‌‌ పోస్టుల భర్తీకి ఈ నెల 29న జరుగుతున్న పరీక్ష యథావిధిగా నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలకు 30 మార్కులు వెయిటేజీ ఇస్తున్నామని, ఎగ్జామ్‌కు ప్రిపేర్ కావాలని సూచించారు. పోస్టుల సంఖ్యను పెంచాలని ఏఎన్‌ఎంలు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చిన 1931 పోస్టులకు అదనంగా మరో 323 పోస్టులను కూడా ఇదే నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్ ఉద్యోగం రాని వారిని, చివరివరకూ కాంట్రాక్ట్ ఉద్యోగంలో కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రిటైర్‌‌మెంట్ బెనిఫిట్స్‌ ఇవ్వాలని ఏఎన్‌ఎంల కోరగా, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed