పార్టీ మార్పు వార్తలపై స్పందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by GSrikanth |   ( Updated:2023-02-16 13:13:19.0  )
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల పేరును ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఈటలతో పాటు పలువురు బీజేపీ నేతలు తిరిగి బీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే ప్రచారం బీఆర్ఎస్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. దీంతో ఈ ప్రచారంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకులతోనే సరిపోట్టుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. సోమవారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన కొండా ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాలను షేర్ చేశారు. బీజేపీలో ఇమడలేకపోతున్న ఓ మాజీ ఎంపీ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారని ఇప్పటికే గులాబీ పెద్దలతో ఆయన సంప్రదింపులు చేశారనే కథనాన్ని షేర్ చేశారు.

ఘర్ వాపసీపై ఆసక్తిగా ఉన్న సదరు మాజీ ఎంపీకి బీఆర్ఎస్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని ఈ కథనం పేర్కొంది. మరో కథనంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌లోనే కంటిన్యూ అవుతారని పేర్కొంది. ఈ రెండు వార్తలకు సంబంధించిన పేపర్ క్లిప్‌లను షేర్ చేసిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు ఎంతటి నిరాశలో ఉన్నారో దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. తెలంగాణ వ్యతిరేకులతోనే బీఆర్ఎస్ సంతృప్తి చెందాలని సెటైర్ వేస్తూ ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారి ఫోటోలను షేర్ చేశారు.

ఇందులో సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపినాథ్, పువ్వాడ అజయ్, నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, మల్లారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు ఫోటోలను షేర్ చేశారు. ఇలాంటి తెలంగాణ వ్యతిరేకులే బీఆర్ఎస్‌లో ఉన్నారని విమర్శించారు. బీజేపీ నేతలు బీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో కొండా ఈ రకంగా తాను పార్టీ మారబోవడం లేదని సంకేతాలు ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. కాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ బీజేపీ నేతల విషయంలో బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed