‘మహిళా సాధికారతపై MLC కవిత మాట్లాడటం సిగ్గుచేటు’

by GSrikanth |
‘మహిళా సాధికారతపై MLC కవిత మాట్లాడటం సిగ్గుచేటు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవిత మహిళా ద్రోహి అని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కనీసం ఏడు అడుగులు వేసి రాజ్ భవన్‌కు వెళితే బిల్లులు ఆమోదం పొందేవని, కానీ అడుగులు వేసే ఓపిక, తీరిక సీఎంకు లేకుండా పోయిందని ఆయన విమర్శలు చేశారు. రాజకీయం చేయాలనే దురుద్దేశంతో బిల్లులపై సుప్రీంకోర్టుకు వెళ్లారని ప్రభాకర్ ధ్వజమెత్తారు. గ్యాస్ ధరలు పెంచారని సిలిండర్లతో మంత్రులు ఆందోళన చేస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, నీటి బిల్లులు, బస్సు చార్జీలు పెంచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని మండిపడ్డారు. కరెంటు, నీటిని వినియోగించకుండా మంత్రులు ఉంటారా? అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు.


బీజేపీ వాళ్లు చెబితేనే అరెస్టులు చేస్తున్నారని, ఇక విచారణ సంస్థలు ఎందుకని కేసీఆర్ కుమార్తె కవిత మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. మద్యం కుంభకోణంలో సాక్ష్యాలు ధ్వంసం చేసిందని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న విషయం ఆమెకు గుర్తులేదా? అని ఆయన ప్రశ్నించారు. కవితే మద్యం కుంభకోణంలో పెట్టుబడిదారీ, మధ్యవర్తి అని దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోందని ప్రభాకర్ ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణానికి రాజకీయ రంగు పులిమి సానుభూతి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత పార్టీలో మహిళా ప్రజాప్రతినిధులు కన్నీరు పెట్టుకుంటే పట్టించుకోని కవిత.. మహిళా సాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శలు చేశారు. మహిళలంటే ఓర్వలేని మహిళ ఎవరైనా ఉన్నారంటే అది కవితేనని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, అవమానాలు జరుగుతుంటే కవిత కనీసం స్పందించలేదని ఆయన చెప్పారు. గవర్నర్ పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే స్పందించని కవిత.. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed