Jagga Reddy: తెలంగాణకు తెలుగింటి కోడలు తీరని అన్యాయం

by Gantepaka Srikanth |
Jagga Reddy: తెలంగాణకు తెలుగింటి కోడలు తీరని అన్యాయం
X

దిశ, వెబ్‌డెస్క్: రూ.50 లక్షల కోట్లతో నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్‌(Union Budget-2025) ప్రవేశ పెట్టినా.. తెలంగాణకు మాత్రం ఎలాంటి కేటాయింపులు లేవని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) విమర్శలు చేశారు. శనివారం జగ్గారెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టు బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడం నిరాశకు గురిచేసిందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఏడాదికి లక్ష కోట్ల పన్నులు కడుతున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఆడబిడ్డ అయిన నిర్మలా సీతారామన్.. తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు. అందులో ఇద్దరికి కేంద్రమంత్రి పదవులు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడానికి తప్ప.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదని మండిపడ్డారు.

బడ్జెట్‌పై తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలమ్మతో మాట్లాడి నిధులు తీసుకురావాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజల దృష్టిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ బలహీనులుగా మిగిలిపోవడం ఖాయమని అన్నారు. ‘తెలంగాణలో ఉండి పెద్ద పెద్ద మాటలు నరుకుతారు.. మోడీ దగ్గర కుక్క తోక ఊపినట్టు కూర్చుంటారు’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఐటీఐఆర్(ITIR) ఇవ్వాలనే డిమాండ్ ఉంది. దీనిపై కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోయారు. నిర్మలమ్మ తెలుగు ఆడపడుచు.. తెలంగాణకు ప్రత్యేక నిధి కేటాయించకపోవడంతో ఆమె కూడా రాజకీయ బలహీనురాలిగా భావిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. బలహీనురాలు కాబట్టే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉందని చెప్పారు. పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కలిసి నిధులు ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ ప్రయత్నాలు నిరాశ పరిచేలా బడ్జెట్ ప్రవేశ పెట్టారని మండిపడ్డారు.

రాష్ట్రంలో విర్రవీగడం కాదని.. దమ్ముంటే మోడీని ఒప్పించి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని బండి సంజయ్‌కి జగ్గారెడ్డి సవాల్ చేశారు. ఇది దేశ బడ్జెట్‌లా లేదు. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రవేశ పెట్టినట్లు ఉందని అన్నారు. రొటీన్‌గా వచ్చే నిధులు గొప్ప కాదు.. ఎవరు అడిగినా, అడగకున్నా రాష్ట్రాల వాటా ఎలా రావాలో అలాగే వస్తాయి. తెలంగాణకు ప్రత్యేకంగా ఏం తెచ్చారో చెప్పాలని కిషన్ రెడ్డిని జగ్గారెడ్డి అడిగారు. ‘‘తెలంగాణ బీజేపీ ఎంపీలారా వినండి.. దమ్ముంటే రాష్ట్రానికి నిధలు తెచ్చి చూపించండి’’ అని సవాల్ చేశారు.

Next Story