రాముడి ఫొటోలతో ప్రజల జీవితాలు మారుస్తారా..?: హరీశ్ రావు సూటి ప్రశ్న

by Disha Web Desk 16 |
రాముడి ఫొటోలతో ప్రజల జీవితాలు మారుస్తారా..?: హరీశ్ రావు సూటి ప్రశ్న
X

దిశ, హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి హుస్నాబాద్‌కు 100 పడకల మాతా శిశు ఆసుపత్రిని మంజూరు చేయించామని, మహాసముద్రం గండితో రైతులకు నీరు అందించామని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పర్చామని, అందుకే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ అంబేద్కర్ కూడలిలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. దేవుని ఫొటోలు ఇంటింటికి పంచి ఓట్లు వేయమని ప్రాధేయపడుతున్న బీజేపీ ప్రభుత్వం ... ఆ ఫోటోలతో ప్రజల జీవితాలు మారుస్తుందా? అని, వారి పేదరికాన్ని దూరం చేస్తుందా? అని ప్రశ్నించారు. ఇదే బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో 14 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేసింది గాని రైతులకు, దళితులకు కూలి నాలి చేసుకునే పేదలకు ఎందుకు మాఫీ చేయలేదని మండిపడ్డారు. ఏం అభివృద్ధి చేశాడని బండి సంజయ్‌కు ఓట్లు అడిగే అర్హత ఉందని ప్రశ్నించారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఆరు గ్యారెంటీలు అమలు చేయక సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. తులం బంగారం తుస్సుమంది. కల్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్ అయింది. ఇది కాంగ్రెస్ పని తీరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇంటికి వస్తే నెలకు 2500 చొప్పున ఐదు నెలలకు కలిపి 12,500 ఇవ్వమని గట్టిగా నిలదీయండి.’ అని మహిళలకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. ‘పెంచుతామన్న పెన్షన్ అటే పాయే. కరెంటు సక్కగా రాధాయే. ఇన్ని విధాలుగా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసి పబ్బం గడుపుకుంటోంది. కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలి’. అని సూచించారు. నిన్న రాహుల్ గాంధీ సభకు 30 వేలకు బదులు 3000 మంది కూడా రాలేదు అంటే కాంగ్రెస్ పై ఇప్పటికే ప్రజలకు నమ్మకం పోయింది ఇలా రైతులకు బోనస్ ఇస్తానని బోగస్ చేసిన కాంగ్రెస్ పార్టీకి బడాయి మాటలు మాట్లాడుతున్న బండి సంజయ్‌కి ప్రజలు ఓట్లతోనే తగిన బుద్ధి చెప్పాలని, రెండుసార్లు ప్రజల కోసం పని చేసిన వినోద్ కుమార్‌ను గెలిపించాలని హరీశ్ రావు కోరారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed