‘రెడ్డి నేతలతో నాకు ఎలాంటి విబేధాలు లేవు’.. అంజన్ కుమార్ యాదవ్ వివరణ

by Gantepaka Srikanth |
‘రెడ్డి నేతలతో నాకు ఎలాంటి విబేధాలు లేవు’.. అంజన్ కుమార్ యాదవ్ వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వేదికగా జరిగిన యాదవ కుల సంఘం సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒక సామాజికవర్గ నేతలు యాదవులను రాజకీయంగా ఎదగనీయంగా అడ్డుకుంటున్నారని.. ఇక నుంచి తమ సామాజికవర్గాన్ని తక్కువ చేసి చూసినా, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఊరుకునే ప్రసక్తే లేదని ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా.. ఆయన వ్యాఖ్యలపై అంజన్ కుమార్ యాదవ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘నా మాటలు వక్రీకరించారు. రెడ్డి నేతలతో ఎలాంటి విబేధాలు లేవు. రాహుల్ ప్రధాని కావడమే అందరి లక్ష్యం. కులగణనకు మద్దతుగా మాట్లాడిన మాటలను వక్రీకరించి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి బలహీన వర్గాల వాస్తవ స్థితిగతులు, జనాభా లెక్కలను కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగానే తెలంగాణలో కులగణన జరిగింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ సోమవారం యాదవ కుల బాంధవుల మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనియాడటం జరిగింది.

అయితే ఈ సమావేశంలో తాను అనని మాటలను కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు. వారి మీడియా వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రెడ్లను దుషించినట్టు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. నమస్తే తెలంగాణా దిన పత్రికలో తెలంగాణను అడ్డుకున్నది కాంగ్రెస్ రెడ్లు అంటూ నాపై తప్పుడు వార్తను ప్రచురించింది. దీన్ని నేను ఖండిస్తున్నా, ఇలాంటి తప్పుడు వార్తలను తెలంగాణ ప్రజానీకం నమ్మొద్దని, ఇలాంటి అసత్య కథనాలను ప్రచారం చేసే వారిని సామాజిక బహిష్కరణ చేయాలి. నా స్నేహితులు అనేక మంది రెడ్లు ఉన్నారు. వారు అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక సామాజిక వర్గాన్ని దూషించే వ్యక్తిత్వం నాది కాదు’ అని అంజన్ కుమార్ యాదవ్ ప్రకటనలో పేర్కొన్నారు.




Next Story

Most Viewed