టీఆర్ఎస్ పేరు మార్చినప్పటినుంచి కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి.. బీఆర్ఎస్ కలిసిరాలేదా!

by GSrikanth |   ( Updated:2023-03-19 23:30:31.0  )
టీఆర్ఎస్ పేరు మార్చినప్పటినుంచి కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి.. బీఆర్ఎస్ కలిసిరాలేదా!
X

పార్టీ పేరు మార్పు కేసీఆర్ కు కలిసి రాలేదు. బీఆర్ఎస్‌గా మార్చినప్పటి నుంచి జరుగుతున్న ఘటనలు సీఎంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వరుస అగ్ని ప్రమాదాలు, అకాల వర్షాలు, లిక్కర్ స్కాంలో కుమార్తె కవితకు ఈడీ నోటీసులు, మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. ప్రాంతీయపార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనుకున్నా.. అదీ కుదరడం లేదు. జాతీయ స్థాయిలో ఏ పార్టీలు కలిసివస్తాయో తెలియకపోగా, వీకేసీ, ఆప్ వంటి పార్టీలు తెలంగాణలో సైతం పోటీ చేస్తామని సంకేతాలిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనుకొని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. అయితే అప్పటి నుంచి కేసీఆర్ కు అచ్చిరావడం లేదని పార్టీనేతలు చెబుతున్నారు. తెలంగాణతో బంధం తెగిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపించగా, సొంతపార్టీ నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా అప్పటి నుంచి జరుగుతున్న వరుస ఘటనలు పార్టీని, అధినేతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారిస్తున్నది. దీంతో కేసీఆర్ కుటుంబం మొత్తం సఫర్ అవుతున్నది. జాతీయరాజకీయాల మాటేమోగానీ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవిత ను ఎలా కాపాడుకోవాలనేదానిపై ప్రస్తుతం దృష్టిసారించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆమె కు అండగా రాష్ట్ర మంత్రులను సైతం ఢిల్లీకి పంపుతున్నారు. దీంతో రాష్ట్రంలో పాలన కుంటుపడింది.

ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న పేపర్ లీక్

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ లీకేజీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది. ఇప్పటికే జరిగిన కొన్ని పరీక్షలను రద్దు చేసి, జరగాల్సిన మరికొన్ని పరీక్షలను వాయిదా వేశారు. లీకేజీలో ప్రధాన సూత్రధారులు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ లను సిట్ కస్టడిలోకి తీసుకొని విచారిస్తున్నది. ఈ అంశం ఇప్పుడు ప్రభుత్వానికి పెనుసవాల్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు, విద్యార్థి, యువజన సంఘాలు రోడ్డెక్కాయి. మంత్రి కేటీఆర్ రాజీనామాకు డిమాండ్ చేశాయి. యువత, నిరుద్యోగుల్లో భరోసా కల్పించే ప్రయత్నాలను మంత్రులు చేస్తున్నప్పటికీ, వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్నది.

అగ్ని ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరి

సేఫెస్ట్ సిటీ హైదరాబాద్ అని పాలకులు చెబుతున్నప్పటికీ, నగరంలో చోటుచేసుకుంటున్న వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. డిసెంబర్ నుంచి అగ్నిప్రమాదాలు మరింత ఎక్కువయ్యాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏడు అగ్ని ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. జనవరిలో డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చివేసింది. ఈ ఘటన మరువక ముందే ఇటీవల స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఆరుగురిని బలితీసుకున్నది. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి.

అకాల వర్షాలు...

అకాల వర్షాలు సైతం రాష్ట్ర సర్కారును ఇబ్బంది పెడుతున్నాయి. నాలుగురోజులుగా వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురవడంతో వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నాయి. అధికారులు పంటనష్టం అంచనాలో నిమగ్నమయ్యారు. మంత్రులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నష్టపోయిన రైతన్నను ఆదుకోవాలనే డిమాండ్ ప్రజల నుంచి, సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా.. పంట నష్టం ప్రభుత్వానికి భారంగా మారనున్నది. రైతులను ఆదుకోకపోతే ఆ ఎఫెక్ట్ వచ్చే ఎన్నికలపై పడే అవకాశమున్నది.

తెలంగాణలో పోటీకి వీకేసి, ఆప్ సిద్ధం!

ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించారు. రీజినల్ పార్టీల మద్దతుతో ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళిక రచించారు. జేడీఎస్, వీకేసీ, ఆప్ వివిధ పార్టీల నేతలతో భేటీలు నిర్వహించారు. అయితే ఆ పార్టీలే ఇప్పుడు తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పోటీ చేస్తామని వీకేసీ ప్రకటించింది. ఆప్ సైతం దక్షిణాదిపై దృష్టి సారించి పోటీకి సై అంటున్నది. కొన్ని స్థానాల్లోనైనా గెలిచి తీరాలని ప్రణాళికలు రచిస్తున్నది. కాంగ్రెస్ లేని కూటమికి బీజేపీని ఎదుర్కోవడం సాధ్యం కాదని ఇప్పటికే బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. దీంతో ఎవరూ కలిసి వస్తారో, ఎవరు కలిసిరారో బీఆర్ఎస్ అధినేతకు తెలియడం లేదు. ఒక వేళ ఇతర రాష్ట్రాలపై దృష్టిసారిస్తే తెలంగాణలో నెలకొన్న పరిస్థితులతో బీఆర్ఎస్ కు గడ్డుకాలమే ఎదురుకానున్నది. టీఆర్ఎస్ పేరు మార్చినప్పటి నుంచి కేసీఆర్ కు ఎదురుగాలి వీస్తున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Advertisement

Next Story