- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth Reddy: ఇంత కష్టపడ్డా నన్ను విలన్‌ను చేస్తున్నారు.. కాంగ్రెస్ నేతలపై సీఎం ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లో 70 ముస్లిం జాతులను బీసీల్లో చేర్చామని, ఈ విషయాన్ని తాము ఎక్కడా ప్రచారం చేసుకోలేదని 2022లో నరేంద్ర మోడీ (Narendra Modi) స్వయంగా చెప్పారని.. తాము ముస్లింలను బీసీల్లో (BC) చూపితే బండి సంజయ్ (Bandi Sanjay) ఎట్లా విమర్శిస్తారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. మోడీ చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా..? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన నివేదిక ఒక్కసారి కోర్టులో ప్రవేశపెడితే ప్రతిరాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తుందన్నారు. ఇవాళ బీసీ కులగణనపై అనుమానాల నివృత్తిపై హైదరాబాద్ ప్రజాభవన్‌లో బీసీ సంఘాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే (Caste Census) ప్రక్రియను ప్రతిపక్షాలు తప్పుపట్టడం ద్వారా మొత్తం ఈ వ్యవస్థను కుప్పకూల్చాలనే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. దేశంలో జనగణన చేయాల్సి వస్తే బీజేపీలో ఆధిపత్యం వహిస్తున్న ఒకటి, రెండు పెద్ద సామాజిక వర్గాలకు ఇది తీవ్ర విఘాతం కలుగుతుందనే కాంగ్రెస్ చేసిన కులగణన సర్వేను బీజేపీ తప్పుపట్టి ఈ లెక్కలే లేకుండా చేయాలని చూస్తోందని ఆరోపించారు. బీసీ జనాభాపై అభ్యంతరాలపై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే జనగణనలో కులగణన చేయాలని అప్పుడు నా లెక్కలు తప్పొ ఒప్పో తెలుస్తుందని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ హామీ మేరకు సీఎంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నానని, దేశంలో ఏ సీఎం చేయలేని సాహసానికి పూనుకున్నానని అన్నారు. ఏది కూడా ఓవర్‌నైట్ జరిగిపోదని, కులగణన ఎన్నో ఏళ్ల పోరాటం అని అన్నారు. ఎంతో మంది సీఎంలుగా పని చేసినా ఎవరికీ రానీ అవకాశం తనకు వచ్చిందన్నారు.
కేసీఆర్ చెప్పినవన్నీ కాకి లెక్కలే..
గతంలో కేసీఆర్ (KCR) సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి కాకి లెక్కలు చెప్పారని, ఆ సర్వేలో తప్పులున్నాయి కాబట్టే వివరాలు బయటపెట్టలేదని సీఎం రేవంత్ విమర్శించారు. తమ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. కులగణనకు ప్రభుత్వంలోని 15 శాఖలకు చెందిన అధికారులను నియమించామన్నారు. ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే నమోదు చేశామన్నారు. పారదర్శకంగా సర్వే చేస్తే తప్పని విమర్శలు చేస్తున్నారని, తమ లెక్కలు తప్పని చెప్పేవాళ్లు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కేసీఆర్ బీసీల సంఖ్యకు తక్కువ చూపిస్తే తాము పెంచి చూపించామన్నారు. కేసీఆర్ సర్వేలో మైనార్టీలు ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు. ఇంతకీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు వివరాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీసీల లెక్క ఎంత.., కేసీఆర్ సామాజిక వర్గం లెక్కలు ఎంతో తెలుస్తాయనే వారు సర్వేలో పాల్గొనడం లేదని విమర్శించారు. ప్రభుత్వం చేసిన లెక్క తప్పు అనడం తప్ప కేసీఆర్, హరీశ్ రావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరైనా ఒక్క సూచననైనా చేశారా? ఏ తప్పు లేదు కాబట్టే అబద్ధాలు చెబుతున్నారని ఫైరయ్యారు.
కాంగ్రెస్ నేతలకు క్లాస్
కులగణన విషయంలో కొందరు అతి తెలివితో లేదా వారి గుర్తింపు కోసమో ఈ లెక్కలు తప్పు అనేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ (Congress) నేతలపై సీఎం ఫైరయ్యారు. బీసీలకు న్యాయం చేయాలని కులగణన సర్వేను ఎదో రకంగా పట్టాలెక్కించేందుకు తల బద్దలుకొట్టుకుంటుంటే.. మళ్లీ తనపైనే రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘కులగణన సర్వే చేయని వ్యక్తి హాయిగా ఫామ్‌హౌస్‌లో పడుకున్నాయన మంచోడు అయ్యారు.. బీసీలంటే లెక్కనే చేయని తండ్రి, కొడుకు, అల్లుడు మంచోళ్లు అయ్యారు.. వాళ్ల సంఘాల మీటింగ్‌లు పెడితే మనోళ్లు వెళ్లి కూర్చుంటున్నారు.. ఇంత కష్టపడి కులగణన సర్వేచేసినా రేవంత్‌రెడ్డిని విలన్‌ను చేస్తున్నారు.. కులగణన వద్దు అనేవాళ్లు ఎలాగు విలన్లే.. మీకోసం ప్రయత్నిస్తున్న నన్ను కూడా తప్పు పడితే నష్టం మీకా నాకా?’ అని ప్రశ్నించారు. మీరు అండగా నిలబడకపోతే ఎలా ముందుపడుతుందని నిలదీశారు. కులగణన సర్వేను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ బీసీ నేతలదేనని స్పష్టం చేశారు. అంతా తానే చూసుకుంటానని అనుకోవడం సరికాదని, కులగణన లెక్కలు తప్పు అని విమర్శిస్తున్న వాళ్లకు ఎక్కడికక్కడ సమాధానం చెప్పాలని సూచించారు. బీసీ లెక్కలకు చట్టబద్ధత కల్పించడంతో నా బాధ్యత అయిపోతుంది.. అక్కడి నుంచి దీన్ని ముందుకు తీసుకువెళ్తారో మీ ఇష్టం అని అన్నారు. బీసీ నేతలు కులాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలని యూనివర్సిటీల్లో మేధావులతో సెమినార్లు నిర్వహిచాలని ఆదేశించారు.
Read More : రాహుల్ గాంధీ ఆదేశాలే పాటించా.. కులగణనపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు