టీఆర్ఎస్‌ నాయకుల అండతో కబ్జా.. 'దిశ' కథనంతో రంగంలోకి బీజేపీ నేతలు!

by GSrikanth |
టీఆర్ఎస్‌ నాయకుల అండతో కబ్జా.. దిశ కథనంతో రంగంలోకి బీజేపీ నేతలు!
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: 'దిశ' దిన ప‌త్రిక‌లో ఇటీవ‌ల వ‌చ్చిన `ద‌ర్జాగా రోడ్డు క‌బ్జా` క‌థ‌నానికి స్పందిస్తూ స్థానిక బీజేపీ నాయ‌కులు కృష్ణవేణి హాస్పట‌ల్ ఎదుట ధ‌ర్నాకు దిగారు. వెంట‌నే క‌బ్జాదారుల చెర‌నుండి రోడ్డు ఆక్రమ‌ణ‌లు తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల అండ‌దండ‌ల‌తో కృష్ణవేణి యాజ‌మాన్యం రోడ్డును ఆక్రమించింద‌ని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్య‌క్షులు సామ రంగారెడ్డి ఆరోపించారు. హ‌య‌త్‌న‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ క‌ళ్లెం న‌వ‌జీవ‌న్‌రెడ్డి, వంద‌లాది బీజేపీ కార్యక‌ర్తల‌తో క‌లిసి కృష్ణవేణి హాస్పట‌ల్ వద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. హయత్ నగర్ డివిజన్ ప‌రిధిలోని బస్ డిపోకు వెళ్లేదారిలో పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, శ్రీనివాస కాలనీతో పాటు పలు కాలనీవాసుల‌కు ఇదే ప్రధాన రోడ్డు అని తెలిపారు.

అయితే క్రిష్ణవేణి హాస్పటల్ యాజ‌మాన్యం మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా టీఆర్ఎస్‌ నాయకుల అండతో రోడ్డును ఆక్రమించి హాస్పిటల్ కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని 'దిశ' దిన ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నంతో స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్‌రెడ్డి, బీజేపీ నాయ‌కుల‌తో క‌లిసి నిర్మాణ పనులను పర్యవేక్షించి అక్రమ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని హాస్పిటల్ ముందు బైఠాయించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. ప‌దికి పైగా కాలనీలకు వెళ్లే ప్రధాన మార్గంలో టీఆర్ఎస్‌ నాయకుల అండతో రోడ్డు కబ్జాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయకపోతే బీజేపీ పోరాటాలకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఉగాది ఎల్లప్ప, కార్యదర్శి గోవింద చారి, సీనియర్ నాయకులు ఎర్రవెల్లి సత్యనారాయణ, అనూప్‌రెడ్డి, పలు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed