Telangana DGP: ఎన్‌కౌంటర్‌పై డీజీపీ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
Telangana DGP: ఎన్‌కౌంటర్‌పై డీజీపీ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టులు చేస్తున్న దారుణ హత్యలను అడ్డుకునేందుకు పోలీస్ శాఖ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారని డీజీపీ జితేందర్ తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ చేసిన వ్యాఖ్యలను సోమవారం డీజీపీ ఖండించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో విష పదార్థాలు ప్రయోగించారని అనడం అవాస్తవం అని అన్నారు. స్పృహ కోల్పోయిన తర్వాత కాల్పులు జరిపారని జాతీయ రాష్ట్ర పౌర హక్కుల సంఘం చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు.

ఇది పూర్తిగా దుష్ప్రచారం అని అన్నారు. ఎదురుకాల్పులకు కొద్ది రోజుల ముందు ఇన్ ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరు ఆదివాసిలైన ఉయిక రమేష్, ఉయిక అర్జున్‌లను మావోయిస్టులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారని తెలిపారు. ఇటువంటి సంఘటనలను అడ్డుకునేందుకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని తెలిపారు. మావోయిస్టులు అత్యాధునికమైన ఆయుధాలను ఉపయోగించి పోలీసులపై కాల్పులు జరిపారని పేర్కొన్నారు.

పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు సాయుధ మావోయిస్టులు మరణించారని తెలిపారు. అదేవిధంగా, మృతదేహాల శవ పరీక్షలు హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సూచనల మేరకు జరుగుతున్నాయని తెలియజేశారు. కేసు దర్యాప్తు అధికారిగా వేరే జిల్లా డీఎస్పీని నియమించామని, దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed