Deputy CM Bhatti: ఉద్యోగ నోటిఫికేషన్లపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
Deputy CM Bhatti: ఉద్యోగ నోటిఫికేషన్లపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాదులోని అశోక్ నగర్‌(Ashok Nagar)లో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే ఉద్యోగాల సాధన కోసం అని అన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ(Job Notifications) చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని తరహాలో ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తున్నామని చెప్పారు. ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో ముందే తెలియజేస్తున్నామని ఆ పనిలో భాగంగా ఇప్పటికే గ్రూప్ -1 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని, గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించబోతున్నామని వెల్లడించారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో విజయవంతంగా ఉద్యోగాల భర్తీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మేధస్సు ఉన్నప్పటికీ నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలవారు ఆర్థిక ఇబ్బందులతో యూపీఎస్సీ పరీక్షలను సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మన రాష్ట్రం నుంచి మెయిన్స్‌కు ఎంపికైన వారికి ఇంధన శాఖ పక్షాన ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగా అందించినట్లు తెలిపారు. మెయిన్స్ సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి కూడా లక్ష రూపాయలు ప్రోత్సాహంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మెటీరియల్, ప్రత్యేక శిక్షణ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు వివరించారు. సివిల్ సర్వీస్‌కు మన రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఎంపిక అయితే మన ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

సివిల్ సర్వీస్ అయినప్పటికీ పాలనలో మనవాళ్లు ఎంత ఎక్కువ మంది ఉంటే ప్రాంతీయ అభిమానంతో సంక్షేమ పథకాలు, బడ్జెట్ రూపకల్పన, ఇతర అంశాల ద్వారా మన రాష్ట్రానికి అంత ఎక్కువ లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందన్నారు. యూపీ క్యాడర్లో పనిచేస్తున్నప్పటికీ ప్రాంతీయ అభిమానంతో తెలుగు వారైన మోహన్ రావు, అరుణ ల ఆధ్వర్యంలో హైదరాబాదులో యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ప్రారంభించడం అభినందనీయం అన్నారు. ఏ అంశాలపై దృష్టి పెట్టి, ఎలా చదివితే ఎంపిక అవుతామో తెలుసుకుంటే ఎక్కువమంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఉత్తర భారత దేశంలో ఎక్కువ అకాడమీలు అందుబాటులో ఉండడంతో ఆ రాష్ట్రాల నుంచి సివిల్ సర్వీసెస్‌కు ఎక్కువమంది ఎంపిక అవుతున్నారని తెలిపారు. మన రాష్ట్రానికి మేలు జరగాలంటే పెద్ద సంఖ్యలో సివిల్స్ కోచింగ్ అకాడమీలు రావలసిన అవసరం ఉందన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story