పంటలు ఎండిపోకుండా చూడండి.. కలెక్టర్లకు CS శాంతికుమారి ఆదేశం

by Gantepaka Srikanth |
పంటలు ఎండిపోకుండా చూడండి.. కలెక్టర్లకు CS శాంతికుమారి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో యాసంగి పంటలకు సరిపడా సాగు నీరు అందించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సోమవారం సచివాలయం నుండి ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు. యాసంగి పంటలకు నీటి నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతేడాదితో పోలిస్తే నికర సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి లభ్యత సౌకర్యంగా ఉందన్నారు. రాబోయే పది రోజులలో విద్యుత్, నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలన్నారు. జిల్లాల్లో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు మండల స్థాయి బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన నిర్వహణ ఉండేలా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు.

రాష్ట్రంలో నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా తగినంత పరిమాణంలో ఉన్నాయని, రైతులకు అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు ఉత్తమ పద్ధతులను ఎంచుకోవాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌లో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed