రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: CPM

by GSrikanth |
రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: CPM
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన రైల్వే శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ విధానాల వల్లే ప్రమాదం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రైల్వేల ఆధునీకరణలో భాగంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలాదిమంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, రైల్వే స్టేషన్ల సొబగుల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారని, అదే సమయంలో రైల్వే లైన్లు, సిగ్నల్స్‌ వ్యవస్ధ, ట్రాకుల ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయమన్నారు.

రైల్వేశాఖలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రధానంగా ట్రాక్‌ పర్యవేక్షణ, తదితరాల్లో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని రైల్వే భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 300మంది ప్రయాణీకులు మరణించినట్టు, 1000 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తున్నదని, ఈ ఘటనపట్ల సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. మరణించిన వారికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Next Story