తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదు: కూనంనేని

by GSrikanth |
తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదు: కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: విభజన హామీలను అమలు చేయని బీజేపీకి తెలంగాణా రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో విభజన హామీల సాధన కోసం సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్రను కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అద్యక్షతన జరిగిన ప్రారంభ సభలో కూనంనేని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పట్ల వివక్ష చూపుతున్నదని, కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా విభజన హామీలను అమలు చేయలేదని అన్నారు.


అందుకే సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్రను ప్రారంభించామని, విభజన హామీల సాధన కోసం సీఎం కేసీఆర్ విపక్షాలను కలుపుకుని పార్లమెంటు ఎదుట ధర్నా చేయాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ అరడజను దొంగల కోసం దేశాన్ని దోచి పెడుతున్నదని, వారిని సాగనంపాలని, వంద సంవత్సరాల నుండి అదికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన సీపీఐ పోరాడుతున్నదని అన్నారు. బయ్యారం ఉక్కును అక్రమంగా రక్షణ స్టీల్‌కు లక్షల టన్నుల తరలించడాన్ని 2010 సంవత్సరంలో అడ్డుకొని అసెంబ్లీలో దీనిపై అప్పటి ప్రభుత్వానికి తెలియజేసి ఆపడం జరిగిందని, సీపీఐకి మాత్రమే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై అడిగే హక్కు ఉందని అన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని అన్నారు.

ప్రజా పోరు యాత్ర కన్వీనర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఈనెల 25 నుండి ఆరు జిల్లాల మీదుగా ఏప్రిల్ 5 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలు అయిన ములుగు, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, వరంగల్, భూపాలపల్లి మీదుగా యాత్ర కొనసాగుతుందని, ప్రజలు ప్రజాస్వామిక వాదులు పోరు యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి, భూపాలపల్లి కార్యదర్శి రాజ్ కుమార్, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed