సమంత, రకుల్ ప్రీత్, మంచులక్ష్మి బ్రాండ్ అంబాసిడర్లా?

by Gantepaka Srikanth |
సమంత, రకుల్ ప్రీత్, మంచులక్ష్మి బ్రాండ్ అంబాసిడర్లా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లు పవర్‌లో ఉన్న కేసీఆర్ ఆంధ్రా, ఇతర రాష్ట్రాల వ్యక్తులకు పెద్ద పీఠవేసి, ఇప్పుడు తెలంగాణ అంటూ మరోసారి సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి సంబంధం లేని మంచులక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, సమంతలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించినప్పుడు సోయి లేదా? అంటూ ఆయన ప్రశ్నిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని, ఎవరు అడ్డుపడినా, ఆగేది లేదన్నారు. యాదాద్రి ఆర్కిటెక్‌గా ఆంధ్రా వ్యక్తి ఆనంద్ సాయిని పెట్టినప్పుడు ఈ సెంటిమెంట్ లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి గౌరవం ఇస్తున్నారని, చిహ్నం, గీతంపై అనవసర రాద్ధాంతం వద్దన్నారు. తెలంగాణ కవిత అందెశ్రీకి ఎక్కడ గౌరవం దక్కుతుందోనని, కేసీఆర్ కుటుంబం ఇన్నాళ్లు పట్టించుకోలేదన్నారు.


తెలంగాణ చిహ్నంపైనా బీఆర్ఎస్ అనవసరంగా గొడవ చేస్తోందన్నారు. ప్రజలు, కవులు, కళాకారుల అభిప్రాయంతోనే చిహ్నం రూపొందిస్తున్నారన్నారు. చార్మినార్, కాకతీయ తోరణంపై తమకు ఎనలేని గౌరవంత ఉన్నదన్నారు. పల్లకిని ఎక్కిన వారే కాకుండా, ఆ మోసిన బోయల చరిత్ర కూడా తెలిసేలా సీఎం ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే కేసీఆర్ తన పార్టీ పేరు ఎందుకు మార్చారో చెప్పాలని కోరారు. ‘జయ జయహే తెలంగాణ’ పాట తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్ర గీతంగా చేయాలన్న సోయి బీఆర్ఎస్‌కు లేకుండా పోయిందని విమర్శించారు. ‘జయ జయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గీతంగా చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణిని ఆంధ్రా వాడంటూ ప్రచారం చేయడం దారుణమన్నారు. ఆంధ్రా వాళ్ళ కాళ్లలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పినప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా? అంటూ విమర్శించారు.

Next Story