- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాజీవ్ యువ వికాసంతో మారనున్న యువకుల జీవితాలు : భట్టి విక్రమార్క

దిశ, తెలంగాణ బ్యూరో : రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగడం వల్ల తెలంగాణలో ఈ స్కీమ్ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో యువ వికాసం పథకం అమలుపై బ్యాంకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం ఒక సాధారణ సంక్షేమ పథకంగా చూడవద్దని బ్యాంకర్లను కోరారు. మానవీయ కోణంలో ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించి పథకానికి రూపకల్పన చేసినట్టు వివరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో స్వయం ఉపాధి పథకాలకు ఏనాడు ఏ ప్రభుత్వం కేటాయింపులు చేయలేదని తెలిపారు.
కొలువుల కోసం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలపాటు నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని అన్నారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మిగిలిపోయిన నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థికంగా సామాజికంగా రాష్ట్రంలోని యువతకు సహాయపడేందుకు బ్యాంకర్లు తోడ్పాటును అందించాలన్నారు.
రాజీవ్ వికాసం ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టించబడుతుందన్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొదలు కమిషనర్ల వరకు ఈ పథకం రూపకల్పన, ఎంపికైన వారికి శిక్షణ పై తీవ్ర కసరత్తు చేసినట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు ఖర్చు పెడుతుంది బ్యాంకర్లు 1,600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలి అన్నారు. ఈ పథకంలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా మంచి పేరు దక్కుతుందని, యువ వికాసం పథకం కింద లబ్ధి పొందే యువకులకు వ్యాపారం చేసుకోవడం, లాభాలు సాధించడం పైన అధికారులు కనీసం మూడు రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణ ఇస్తారని, వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడితే శిక్షణ సంస్థలు మద్దతు ఇస్తాయని బ్యాంకర్లకు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని, మరికొన్ని ప్రాంతాల్లో రూరల్ బ్యాంకులు ఉంటాయన్నారు.
ఈ పథకం విజయవంతం చేసేందుకు బ్యాంకర్లు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు బ్యాంకర్లతో త్వరలో సమావేశంలో నిర్వహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అర్హులకు సాంక్షన్ లెటర్లు అందజేసిన తర్వాత రాష్ట్రస్థాయిలో మరోసారి ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహిస్తామన్నారు. రాజీవ్ యువ వికాసంలో లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల చేయగానే, బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఎస్టీ సంక్షేమ శాఖ సెక్రెటరీ శరత్, బీసీ సంక్షేమ శాఖ సెక్రెటరీ శ్రీధర్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, అన్ని శాఖల బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.