Kishan Reddy : రైతుల ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-10 09:18:46.0  )
Kishan Reddy : రైతుల ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: రైతుల ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(G. Kishan Reddy) మండిపడ్డారు. భూదాన్ పోచంపల్లి మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి, ధాన్యం కొనుగోలులో పడుతున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు ధాన్యం కొనుగోలు, రైతు రుణ మాఫీ సమస్యలను కిషన్ రెడ్డికి ఏకరువు పెట్టారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యంపై ఐకేపీ అధికారులను ప్రశ్నించగా, మిల్లులు ట్యాగ్ కాలేదని చెప్పగా, అదంతా ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతే కదా అని అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ధాన్యం కొనుగోలు సమస్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి కొనుగోలులో జరుగుతున్న జాప్యం పట్ల ప్రశ్నిస్తూ వెంటనే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 45రోజులైన రైతుల ధాన్యాన్ని 5శాతం కొనుగోలు చేయకపోవడం అన్యాయమన్నారు. అనేక కొనుగోలు కేంద్రాలు తెరిచి వాటిని నామమాత్రం చేశారని విమర్శించారు. లారీలు, హమాలీలు లేరని, టార్ఫాలిన్లు, గన్నీ బస్తాలు లేవని కొనుగోలు చేయడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఉరుకులు పరుగులు పెట్టే అధికారులు రైతుల ధాన్యం కొనుగోలు సమస్యలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల ధాన్యాన్ని కొనుగోలు జరిపించడం చేతకాదు కాని...బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తా, ఎవరడ్డమొస్తరో చూస్తా అని, పేగులు మెడలో వేసుకుంటా అని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడన్నారు.

Advertisement

Next Story