భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామంటూ కాంగ్రెస్ ప్రకటన.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే

by GSrikanth |
భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామంటూ కాంగ్రెస్ ప్రకటన.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: భజరంగదళ్‌ను నిషేధించడమంటే హనుమంతుడిని చెరసాలలో బంధించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనను నిరసిస్తూ శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట ప్రజాస్వామ్యబద్ధంగా హనుమాన్ చాలీసా పఠనం చేయాలని బండి సంజయ్ కుమార్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్ చార్జీలు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో బండి సంజయ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కర్ణాటకలో అధికారంలోకి వస్తే పీఎఫ్ఐపై నిషేధం ఎత్తేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ భజరంగ దళ్ ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం దుర్మార్గంగా పేర్కొన్నారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఆగ్రహంతో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందూ ద్రోహి అని ఆయన మండిపడ్డారు. హిందూ ధర్మానికి ఆపదొస్తే ముందుండి పోరాడే సంస్థ భజరంగ్ దళ్ అని, గోరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న సంస్థను నిషేధించాలనుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు అడ్డుకోకపోతే తెలంగాణలో కూడా భజరంగ్ దళ్ ను నిషేధించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందుకే ప్రతి కార్యకర్త కాషాయ కండువా ధరించి నిరసన తెలపాలని, పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడే హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన తెలపాలని సంజయ్ స్పష్టంచేశారు.

ఇదిలా ఉండగా జమ్మూకాశ్మీర్ లో హెలికాప్టర్ ప్రమాదంలో కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బ అనిల్ మరణించడంపై బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ కుమార్ అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న జిల్లా నేతలతో మాట్లాడుతూ అనిల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని ఆదేశించారు. అంతిమ సంస్కార ఏర్పాట్లతోపాటు తదుపరి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed