- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రేషన్‌కార్డు దరఖాస్తుల స్వీకరణలో గందరగోళం.. రెండింతల రుసుము వసూలు!

దిశ, తెలంగాణ బ్యూరో: రేషన్ కార్డుల ప్రక్రియలో గత రెండ్రోజులుగా గందరగోళం నెలకొనడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. ఆ శాఖలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వలన సర్కారుకు చెడ్డపేరు వస్తున్నట్లు ప్రధానంగా చర్చ జరుగుతున్నది. అసలు రేషన్ కార్డుల ప్రక్రియలో అధికారులు ఎందుకు గందరగోళానికి గురవుతున్నారో ప్రభుత్వ పెద్దలకు సైతం అర్ధం కావడం లేదు. ఉన్నట్టుండి జీవోలు తీసుకరావడం, వెంటనే వాటిని రద్దు చేయడం, ఎన్నికల కోడ్అంటూ సాకులు చెప్పడంపై ప్రభుత్వ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తు్న్నాయి. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రజలు గందరగోళానికి గురవ్వకుండా ఉండేందుకు ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. అర్హులైన వారు మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆదేశాలు పాస్ కావడంతో ఆయా కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. దరఖాస్తు అనంతరం ఆ రశీదును పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఇవ్వాలని మీ సేవ కేంద్రాల నిర్వహకులు సూచించడంతో ప్రజలు సమీపంలోని ఆ శాఖ కార్యాలయానికి పరుగులు పెటినట్లు తెలుస్తోంది.
ఎక్కడ చూసినా పెద్ద క్యూ లైన్..
అయితే, మీ సేవా కేంద్రాల్లోనే కాకుండా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోనూ పెద్ద క్యూ లైన్ ఉన్నట్లు సమాచారం. సుమారు రెండు గంటల పాటు జనాలు ఎదురుచూడాల్సి వచ్చినట్లు తెలిసింది. పెద్ద సంఖ్యలో జనం రావడంతో స్థానిక అధికారులు జిల్లా అధికారులకు తెలపడంతో రశీదు అవసరం లేదని మరోసారి ప్రకటన చేయాల్సి వచ్చింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఉదయం నుంచే కొత్త రేషన్ కార్డు అవసరమున్న జనం దగ్గరల్లోని మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. కొత్త రేషన్ కార్డులతో పాటు అందులో మార్పులు, చేర్పులు, ఆధార్‌కార్డుల అప్డేట్ కోసం మరికొందరు రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నట్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా తీసుకున్న దరఖాస్తులు ఇప్పటికే 10.50 లక్షల ఉండగా, కొత్తగా మీ సేవా కేంద్రాల ద్వారా మరో 2.50 లక్షలు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కులగణన సర్వే టైంలో లబ్దిదారుల ఎంపిక విషయంలో ఇబ్బందులు రావడంతో ప్రభుత్వం రేషన్ కార్డు ప్రక్రియను నిలిపివేసింది. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరగడంతో మళ్లీ దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
కార్డు అప్లైకు ప్రత్యేక గడువు లేదు..
కొత్తరేషన్‌కార్డుల కోసం మీసేవా కేంద్రాలకు భారీగా జనం వస్తుండటంతో గమనించిన పౌర సరఫరాల శాఖ స్పందించి రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని, దీనికి ప్రత్యేకమైన గడువు లేదని పేర్కొంది. జనాలు ఇప్పుడే తొందర పడాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. ప్రజావాణి, కులగణన, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసి వారు మళ్లీ అప్లై చేయాల్సిన పని లేదని తెలిపింది. ఈ మూడింటికీ వెళ్లని వారు మాత్రమే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తు అనంతరం సంబంధిత రశీదు కూడా ఎవరికి ఇవ్వాల్సిన పనిలేదని, తమ వద్దే ఉంచుకోవాలని సూచించింది. కొందరు రాజకీయ దళారులు రేషన్‌కార్డులపై తప్పుడు సమాచారం ఇస్తారని.. అలాంటప్పుడు అనుమానం ఉంటే స్థానికంగా ఉండే మున్సిపల్, రెవిన్యూ అధికారుల వద్ద వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
రెండింతల రుసుము వసూలు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీసేవలో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేస్తే రూ.100 ఫీజు వసూలు చేయాలి. కానీ, నిర్వహకులు మాత్రం రూ.150 వరకు దండుకుంటున్నట్లు సామాన్యులు వాపోతున్నారు. ఆధార్అప్డేట్ చేస్తే రూ.50కి గాను రూ.80 వరకు తీసుకున్నట్లు తెలిసింది. నిర్వహకులు చెప్పినంత చెల్లించిన వారికి గంటలోపు పని పూర్తవుతుందని.. క్యూలైన్లలో వచ్చిన వారికి 2 గంట టైం పడుతున్నట్లు సమాచారం. మీ సేవా కేంద్రాల్లో పనిచేసే అసిస్టెంట్ల ద్వారా నిర్వహకులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రంగంలోకి రాజకీయ బ్రోకర్లు..
ప్రభుత్వ కార్యాలయల వద్ద తిష్టవేసి కుల, ఆదాయ, నివాస పత్రాలు ఇప్పించే దళారులు తాజాగా రేషన్‌కార్డుల ప్రక్రియను క్యాష్ చేసుకుంటున్నారు. రూ.1500 చెల్లిస్తే నెల రోజుల్లోగా కొత్త కార్డులు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది. జనాలను నమ్మించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి దిగిన ఫోటోలను ఆధారంగా వాడుకుని, తమకు పలుకుబడి ఉందని నమ్మించి డబ్బులు లాగుతున్నట్లు తెలిసింది. అయితే, ఇటువంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పౌరసరఫరాల అధికారులు హెచ్చరిస్తున్నారు.