సత్ఫలితాలిస్తున్న మంత్రి సీతక్క నిర్ణయం.. 48 గంటల్లోనే హెడ్ ఆఫీసుకు ఫీడ్ బ్యాక్

by Gantepaka Srikanth |
సత్ఫలితాలిస్తున్న మంత్రి సీతక్క నిర్ణయం.. 48 గంటల్లోనే హెడ్ ఆఫీసుకు ఫీడ్ బ్యాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘అయ్యా మా కాలనీలో నీళ్లు రావడం లేదు.. మా వీధికి మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు’ అంటూ వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటవెంటనే స్పందిస్తున్నారు. మిషన్ భగీరథ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ సత్ఫలితాలనిస్తున్నది. గతేడాది డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వందలాది సంఖ్యలో వచ్చిన కంప్లయింట్స్‌‌కు అధికారులు తక్షణ పరిష్కారం చూపారు.

తాగునీటి సమస్యలకు చెక్

హైదరాబాద్ వంటి మహానగరాల్లో తాగునీటి సరఫరాలో ఏవైనా అంతరాయాలు వస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సమస్యను పరిష్కరించుకుంటారు. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఫెసిలిటీ లేదు. ప్రజలు తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో కూడా వారికి తెలీదు. నీళ్లు రాకుంటే ఇబ్బందులను అనుభవిస్తారు తప్పితే ఎవరినీ అడిగేందుకు సాహసించరు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

280 కాల్స్.. 187 పరిష్కారం

పట్టణాల్లో మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్‌ 1800-599-4007ను తీసుకొచ్చింది. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో 2024 డిసెంబర్ 23న ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ఈ నెల 25 వరకు కాల్ సెంటర్‌కు మొత్తం 280 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో పట్టణ ప్రాంతాల నుంచి 73.. గ్రామీణ ప్రాంతాల నుంచి 207 కంప్లయింట్స్ వచ్చాయి. వీటిలో 187 ఫిర్యాదులను అధికారులు పరిష్కరించారు. వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 90 శాతం వాటికి పరిష్కారం చూపినట్టు అధికారులు తెలిపారు.

హెడ్ ఆఫీస్ నుంచి కాల్ కన్ఫర్మేషన్..

కాల్ సెంటర్‌కి వచ్చిన ఫిర్యాదులను సిబ్బంది ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి చేరవేస్తుండడంతో సత్ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వచ్చిన సమస్యను 48 గంటల్లోనే పరిష్కరించి హెడ్ ఆఫీస్‌కు క్షేత్రస్థాయి సిబ్బంది నివేదికను అందిస్తున్నారు. ఆ సమస్య పరిష్కారం అయిందా? లేదా? అని ఆ ఫిర్యాదు దారుడికి కాల్ చేసి హెడ్ ఆఫీస్ అధికారులు ధ్రువీకరించుకోవడం గమనార్హం. తాగు నీటి స‌ర‌ఫ‌రా స‌జావుగా సాగేలా.. గ్రామాల్లో మంచినీటి స‌హాయ‌కుల నియామ‌కం చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులున్నా వారు తక్షణమే రంగంలోకి దిగి మరమ్మతులు చేస్తున్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌ స‌ర‌ఫ‌రాలో ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని స‌ర‌ఫ‌రా చేసేలా ఏర్పాట్లు చేశారు.

Next Story

Most Viewed