BREAKING: నంది అవార్డుల పేరు మార్పు.. రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం

by Satheesh |   ( Updated:2024-01-31 14:31:01.0  )
BREAKING: నంది అవార్డుల పేరు మార్పు.. రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా రంగంలో రాణించిన ఉత్తమ నటులకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న నంది అవార్డుల పేరును మార్చింది. ఇకపై నంది అవార్డుల స్థానంలో ‘గద్దర్’ పేరిట అవార్డులు ప్రధానం చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ప్రతి ఏటా గద్దర్‌ జయంతి రోజున ఈ అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఇక నుండి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు ఇస్తామని తెలిపారు. గద్దర్ జయంతి వేడుక సందర్భంగా సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు. కాగా, బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నంది అవార్డులను పునరుద్ధరించాలని పలువురు సినీ ప్రముఖులు కోరినట్లు తెలిపారు.

ఈ మేరకు ఇకపై ఉత్తమ సినీ నటులకు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఈ అవార్డులకు సంబంధించిన జీవోను త్వరలోనే విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటతో ఉద్యమం ఉవ్వెత్తును ఎగసేలా చేసిన గద్దర్ విగ్రహాన్ని తెల్లాపూర్‌లో ఏర్పాటు చేసేందుకు సైతం రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గద్దర్ పేరిట అవార్డులు ప్రధానం చేస్తామని ప్రకటించి ప్రభుత్వం ఆయనను మరోసారి గౌరవించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ సైతం ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story